సారాంశం
ఆయన ఓ ప్రముఖ డాక్టర్.. 16 వేలకు పైగా గుండె శస్త్రచికిత్సలు చేసి ప్రజలకు కొత్త జీవితాన్ని అందించిచారు. అయితే మంగళవారం అదే వైద్యుడు గుండెపోటుతో మరణించారు.
అహ్మదాబాద్: ఆయన ఓ ప్రముఖ డాక్టర్.. 16 వేలకు పైగా గుండె శస్త్రచికిత్సలు చేసి ప్రజలకు కొత్త జీవితాన్ని అందించిచారు. అయితే మంగళవారం అదే వైద్యుడు గుండెపోటుతో మరణించారు. వివరాలు.. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీ 41 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. డాక్టర్ గౌరవ్ మరణవార్త గుజరాత్ వైద్య రంగంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గౌరవ్ నిద్రిస్తున్న సమయంలో గుండెపోటుతో మృతి చెందారు. ప్రతిరోజు లాగే సోమవారం రాత్రి వరకు కూడా గౌరవ్.. పలువురు పెషేంట్లకు చికిత్స అందించారు.
హాస్పిటల్‌లో పని పూర్తయ్యాక గౌరవ్.. ప్యాలెస్ రోడ్డులోని తన నివాసానికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత భోజనం చేసి కొద్దిసేపటికి నిద్రకు ఉపక్రమించారు. మంగళవారం ఉదయం గౌరవ్ నిద్రలేవలేదు. ప్రతి రోజు 6 గంటలకు నిద్రలేచే గౌరవ్.. ఆ సమయం దాటిన మేల్కొనలేదు. దీంతో కొంచెం ఆలస్యంగా గౌరవ్ కుటుంబ సభ్యులు అతనిని మంచం నుండి లేపడానికి ప్రయత్నించారు. కానీ అతను స్పందించలేదు. దీంతో వెంటనే అతన్ని జీజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ గౌరవ్‌ను పరిశీలించిన వైద్యులు.. అప్పటికే అతను మరణించాడని చెప్పారు. గౌరవ్ మరణానికి గుండెపోటు కారణమని చెప్పారు.
ఇక, ఆరోజు రాత్రి గౌరవ్ ప్రవర్తనలో ఎటువంటి అసౌకర్యం కనిపించలేదని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అతను కూడా ఎలాంటి అసౌకర్యం ఉన్నట్టుగా ప్రస్తావించలేదని చెప్పారు. రాత్రి పడుకోవడానికి ముందు అతని ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.
ఇదిలా ఉంటే, గౌరవ్ వయసు ప్రస్తుతం 41 ఏళ్లు కాగా.. తన వైద్య వృత్తిలో 16,000 కంటే ఎక్కువ గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. అయితే మరణానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి జీజీ హాస్పిటల్ అతనికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన నివేదిక రావాల్సి ఉంది. ఇక, గౌరవ్ భార్య వృత్తిరీత్యా డెంటిస్ట్. డాక్టర్ గౌరవ్ మరణంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.