అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో కోర్టు తీర్పుపై గుజరాత్ బీజేపీ యూనిట్ ఓ వ్యంగ్య చిత్రాన్ని రూపొందించింది. అయితే ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది. దీంతో ట్విట్టర్ ఆ పోస్ట్ ను తొలగించింది. 

 2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన 49 మందికి కోర్టు శిక్ష విధించిన తర్వాత భారతీయ జనతా పార్టీ (bjp) గుజరాత్ (gujarath) యూనిట్ ఓ వ్యంగ్య చిత్రం గీసింది. దీనిని ట్విట్టర్ (twitter) లో పోస్ట్ చేసింది. అయితే వ్యంగ్య చిత్రం వివాదానికి దారితీసింది. దీనిని ట్విట‌ర్ తొల‌గించింది. 

గుజ‌రాత్ బీజేపీ వేసిన ఈ వ్యంగ చిత్రంలో ‘‘సత్యమేవ్ జయతే’’తో పాటు ‘‘ భీభత్సాన్ని వ్యాప్తి చేసే వారిని క్షమించవద్దు’’ అనే పదాలతో స్క‌ల్ క్యాప్స్ ధరించినట్లు చూపించింది. వరుస పేలుళ్ల కేసులో దోషులకు అహ్మదాబాద్‌లోని ట్రయల్ కోర్టు శిక్షల పరిమాణాన్ని ప్రకటించిన మరుసటి రోజు దీనిని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. BJP (@BJP4Gujarat) అనే అఫీషియ‌ల్ అకౌంట్ ద్వారా ఇది పోస్ట్ అయ్యింది. ఈ ఫొటో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా షేర్ అయ్యింది. దీంతో వివిధ వ‌ర్గాల నుంచి దీనిపై వ్య‌తిరేక‌త వచ్చింది. ఓ నిర్దిష్ట కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకొనే విధంగా ఈ వ్యంగ చిత్రం ఉంద‌ని చాలా మంది వినియోగదారులు ట్విట్ట‌ర్ కు కంప్లైంట్ చేశారు. దానిని తొల‌గించాల‌ని కోరారు. దీంతో దానిని ట్విట్ట‌ర్ తొల‌గించింది. ఆ పోస్ట్ తమ నిబంధనలను ఉల్లంఘించిందని పేర్కొంది. 

వివాదాస్పద ట్వీట్ల ద్వారా బీజేపీ కోర్టు తీర్పును ఉపయోగించుకుందని గుజరాత్ కాంగ్రెస్ (gujarath congress) ఆరోపించింది. “ ఉగ్రవాదానికి మతం లేదు. ఇద్దరు మాజీ ప్రధానులను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి త‌ప్ప అది ఎవరికీ తెలియదు. ఈరోజు బీజేపీ వివాదాస్పద ట్వీట్ల ద్వారా సంతోషిస్తోంది. కోర్టు తీర్పును ఉపయోగించుకుంటోంది. అయితే అలాంటి తీర్పులను రాజకీయ కోణంలో చూడకూడదు. దాని నుండి రాజకీయ ప్ర‌యోజ‌నం పొంద‌కూడ‌దు ” అని గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి మనీష్ దోషి అన్నారు.

గుజరాత్ బీజేపీ మీడియా సెల్ కన్వీనర్ యజ్ఞేష్ దవే (yagnesh dave) మాట్లాడుతూ.. “ పత్రికలు, వార్తా ఛానెల్‌లలో వచ్చిన కథనాల ఆధారంగా (పార్టీ) వ్యంగ్య చిత్రం రూపొందించింది. దాంట్లో ఏ వర్గాన్ని లక్ష్యంగా చేసుకునే ఉద్దేశం లేదు” అని అన్నారు. అన్ని వార్తాపత్రికలు, టీవీ ఛానెల్‌లు దోషుల ఒరిజినల్ ఫోటోలను ప్రచురించాయ‌ని, ప్ర‌సారం చేశాయ‌ని తెలిపారు. వాటి ఆధారంగా వ్యంగ్య చిత్రాన్ని రూపొందించామని ఆయ‌న చెప్పారు. 

కాగా.. అహ్మ‌దాబాద్ బాంబు పేలుళ్ల ఘ‌ట‌న 2008లో సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 200 మందికి పైగా గాయాల‌పాల‌య్యారు. ఈ కేసులో ఈ నెల 18వ తేదీన ప్ర‌త్యేక కోర్టు తీర్పులు వెలువ‌రించింది. ఇందులో ఇండియన్ ముజాహిదీన్ (Indian Mujahideen) అనే ఉగ్రవాద సంస్థకు చెందిన 38 మంది సభ్యులకు మ‌ర‌ణ శిక్ష‌, మరో 11 మంది దోషులకు మరణశిక్ష విధించింది.ఈ కేసులో ఫిబ్రవరి 8న కోర్టు 49 మందిని దోషులుగా నిర్ధారించింది. 28 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువ‌డింది. ఇంత మంది దోషులకు ఒకేసారి మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి.