సమాచారహక్కు కార్యకర్త హత్య కేసులో గుజరాత్ బీజేపీ నేత, మాజీ ఎంపీ దిను భోఘా సోలంకికి జీవితఖైదు విధిస్తూ సీబీఐ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గిర్‌లోని ప్రఖ్యాత పులుల సంరక్షణా కేంద్రంలోని అడవుల్లో అక్రమ మైనింగ్‌పై ఆర్టీఐ కార్యకర్త అమిత్ జేత్వా పోరాటం చేశారు.

దీనిపై కక్ష గట్టిన మైనింగ్ మాఫియా 2010, జూలై 20న గుజరాత్ హైకోర్టు ఆవరణలోనే అమిత్‌ను కాల్చి చంపించింది. ఈ హత్య కేసులో అమిత్ తండ్రి భిఖిభాయ్ జేత్వా సుధీర్ఘ న్యాయపోరాటం చేశారు.

ఈ హత్య కేసును మొదట అహ్మదాబాద్‌లోని డిటెక్షన్ క్రైమ్ బ్రాంచ్ విచారించింది. కానీ నిందితులంరికీ క్లీన్ చీట్ ఇచ్చింది. దీంతో అమిత్ తండ్రి వెనక్కి తగ్గలేదు... విచారణ సమయంలో 195 మంది సాక్షుల్లో 105 మంది సోలంకి బెదిరింపులకు లొంగిపోయారని.. కేసును సీబీఐ చేత విచారించాలని కోరుతూ భిఖాభాయ్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.

ఇక్కడా కేసు అనూహ్య మలుపు తిరిగింది. విచారణను హైకోర్టు నిలిపివేయడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని... కేసును విచారించాల్సిందిగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది.

తొమ్మిదేళ్ల సుధీర్ఘ విచారణలో తర్వాత సోలంకీతో పాటు అతని మేనల్లుడు శివ సోలంకి, షూటర్ శైలేష్ పాండ్యా, బహుదూర్ సింగ్ వాధర్, పంచన్ జి దేశాయ్, సంజయ్ చౌహాన్, ఉదాజీ ఠాకూర్‌లను కోర్టు దోషులుగా నిర్ధారించింది.

వీరికి జీవితఖైదుతో పాటు రూ. 59,25,000 జరిమానా విధించింది. ఇందులో అమిత్ భార్యకు రూ.5 లక్షలు, ఇద్దరు పిల్లలకు రూ.3 లక్షల చొప్పున ఏదైనా జాతీయ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల్సిందిగా న్యాయమూర్తి గురువారం తీర్పు వెలువరించారు.

ఈ తీర్పు పట్ల అమిత్ జేత్వా తండ్రి భిఖిభాయ్ జేత్వా హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు భారత న్యాయవ్యవస్థ, రాజ్యాంగానికి లభించిన విజయమని పేర్కొన్నారు. ఎట్టకేలకు తన సుధీర్ఘ న్యాయపోరాటం ఫలించిందని భిఖిభాయ్ వ్యాఖ్యానించారు.