గుజరాత్ లోని ఓ రసాయన కర్మాగారంలో పెనుప్రమాదం చోటు చేసుకుంది. భరూచ్ జిల్లా, ఝగడియాలోని జీఐడీసీలో ఉన్న రసాయన కర్మాగారం యూపీఎల్-5 ప్లాంట్ లో పెద్ద పేలుడు సంభవించింది. 

దీంతో కర్మాగారంలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 24 మంది తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపకదళం వాహనాలతో సహా సంఘటనా స్థలానికి చేరుకుంది. మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 

ప్రమాదం జరిగినప్పుడు పేలుడు శబ్దం 15 కిలోమీటర్ల వరకూ వినిపించిందని ప్రాథమిక సమాచారంలో తేలింది. దీంతో స్థానికులంతా భూకంపం వచ్చినట్లు ఉలిక్కిపడ్డారు. ఇళ్ల నుంచి బైటకు పరుగులు తీశారు. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం యూపీఎల్ కంపెనీలో సంభవించిన పేలుడు ధాటికి దగ్గర్లోని గ్రామాల్లోని కొన్ని ఇళ్ల కిటికీల అద్దాలు విరిగిపడ్డాయి. గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలోని పటేల్ గ్రూప్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు.