Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. ఏడుగురు రెబల్ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏడుగురు రెబల్ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా బీజేపీ ప్రకటించింది.

Gujarat assembly polls BJP suspends 7 rebel Leaders
Author
First Published Nov 20, 2022, 5:32 PM IST

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏడుగురు రెబల్ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా బీజేపీ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు చేసిన ఏడుగురు నేతలపై ఆ పార్టీ చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆ నేతలను ఆరేళ్లపాటు సస్పెండ్‌ చేశామని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రకటన విడుదల చేసింది. 

నర్మదా జిల్లా నాందోద్‌కు చెందిన హర్షద్ వాసవ సస్పెండ్‌కు గురైన బీజేపీ నేతల జాబితాలో ఉన్నారు. జునాగఢ్‌లోని కేషోడ్ జునాగఢ్ నుంచి టికెట్ ఆశించిన అరవింద్ లడానీ కూడా సస్పెండ్ అయ్యారు. ఇంకా ఈ జాబితాలో ఛతర్‌సిన్హ్ గుంజరియా, కేతన్ భాయ్ పటేల్, భరత్ భాయ్ చావ్డా, ఉదయ్ భాయ్ షా, కరణ్ భాయ్ బరైయలు ఉన్నారు. వీరు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ క్రమంలోనే డిసెంబరు 1న జరగనున్న తొలి విడత ఎన్నికల్లో వీరు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో బీజేపీ వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. 

ఇక, కేషోడ్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే అరవింద్ లడానీ, నాందోద్‌  నుంచి హర్షద్ వాసవ స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత పార్టీ సస్పెండ్ చేసింది. ఇక, బీజేపీ నాందోద్‌ నుంచి దర్శన దేశ్‌ముఖ్‌, కేషోడ్‌ నుంచి దేవభాయ్‌ మలం పోటీలో నిలిపింది. సురేంద్రనగర్‌కు చెందిన జిల్లా పంచాయతీ సభ్యుడు ఛతర్‌సిన్హ్ గుంజరియా ధృంగాధ్ర స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆయనను బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది.

సస్పెండ్ చేయబడిన ఇతర నాయకుల విషయానికి వస్తే.. పార్డి నుంచి కేతన్ పటేల్,  రాజ్‌కోట్ నుంచి భరత్ చావ్డా,  వెరావల్ నుంచి ఉదయ్ షా, రాజులా నుంచి కరణ్ బరైయ స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఈ నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు చేశారని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ ఆదేశాల మేరకు వారిని సస్పెండ్‌ చేస్తున్నామని బీజేపీ ఒక ప్రకటనలో తెలిపింది.

గుజరాత్‌లో ఏడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ.. పెద్ద సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లను నిరాకరించింది. 160 మంది అభ్యర్థులతో జాబితాను భాగాన్ని ప్రకటించిన కాషాయ పార్టీ.. 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించింది. వీరిలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ కూడా ఉన్నారు.

గత 27 సంవత్సరాలుగా గుజరాత్‌లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో.. మొత్తం 182 స్థానాలకు గాను 99 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. గుజరాత్ చాలా కాలంగా బీజేపీకి కంచుకోటగా ఉంది. ఇక, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. తొలి దశ పోలింగ్ డిసెంబర్ 1న, రెండో దశ పోలింగ్ డిసెంబర్ 5 తేదీన జరగనుంది. డిసెంబర్ 8న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios