Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: వాపిలో ప్రధాని మోడీ రోడ్‌షో.. కిక్కిరిసిన జనం

Gandhinagar: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న శ‌నివారం నాడు వాపిలో రోడ్‌షోను ప్రారంభించారు. నివేదికల ప్రకారం, రాబోయే రెండు రోజుల్లో ప్రధాని రాష్ట్రవ్యాప్తంగా అనేక బహిరంగ సభలను నిర్వహించనున్నారు.
 

Gujarat Assembly Elections: PM Modi's Roadshow in Vapi
Author
First Published Nov 19, 2022, 10:44 PM IST


Gujarat Assembly Election: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న శనివారం వాపిలో రోడ్‌షో ప్రారంభించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య రోడ్ షో కొన‌సాగింది. దీనికి పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు. ప్రధాని మోడీ తనను ఉత్సాహపరుస్తున్న ప్రేక్షకుల వైపు చేతులు ఊపుతూ కనిపించారు. ర్యాలీ నేప‌థ్యంలో ఆ ప్రాంతం జ‌నంతో కిక్కిరిసింది. దీనికి సంబంధించి వీడియో దృశ్యాలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ చేసిన అభివృద్ధిని చూసి.. ప్ర‌జ‌లు మ‌రోసారి త‌మ‌కు అనుకూలంగా ఓటు వేయాల‌ని ప్ర‌జ‌ల‌కు కోరారు.

 

నివేదికల ప్రకారం, రాబోయే రెండు రోజుల్లో ప్రధాని న‌రేంద్ర మోడీ రాష్ట్రవ్యాప్తంగా అనేక బహిరంగ సభలను నిర్వహించనున్నారు. పార్టీ ఎన్నికల వ్యూహానికి తుది మెరుగులు దిద్దేందుకు రాష్ట్రంలో తరచూ ప్రచారం చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కులు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎన్నిక‌ల ప్ర‌చార బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 30కి పైగా భారీ బహిరంగ సభలను నిర్వహించవచ్చని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు కూడా గుజరాత్‌లో ముమ్మరంగా ఎన్నిక‌ల‌ ప్రచారం చేయనున్నారు.

గుజరాత్ అసెంబ్లీకి ఎన్నిక‌లు రెండు ద‌శ‌ల్లో జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబ‌ర్ 1, 5 తేదీల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాలు ఉన్నాయి. కాగా, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ప్ర‌ధాని మోడీ తన సొంత రాష్ట్రానికి వెళ్లడం ఇది రెండోసారి కావడం గమనార్హం. నవంబర్ 6న తన చివరి పర్యటన సందర్భంగా, ప్రధాని మోడీ వల్సాద్ జిల్లాలోని కప్రదాలో ర్యాలీలో ప్రసంగించారు. అలాగే, భావ్‌నగర్‌లో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు.

మీడియా నివేదికల ప్రకారం, ప్రధాని మోడీ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి, ఆదివారం సౌరాష్ట్ర ప్రాంతంలో నాలుగు ర్యాలీలలో ప్రసంగిస్తారు. వెరావల్, ధోరార్జీ, అమ్రేలి, బొటాడ్‌లను ఆయన రాబోయే నాలుగు ఎన్నికల ర్యాలీలకు వేదికలుగా ఖరారు చేశారు. సోమవారం సురేంద్రనగర్‌, భరూచ్‌, నవ్‌సారిలో ప్రధాని మోడీ మూడు ర్యాలీలు నిర్వహించనున్నారు. భరూచ్ మాజీ కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ నియోజకవర్గం కాగా, నవ్‌సారి బీజేపీ రాష్ట్ర చీఫ్ సీఆర్ పాటిల్, దేశవ్యాప్తంగా అత్యధిక మార్జిన్‌లతో తన లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుంటున్నారు.

గుజ‌రాత్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్రంలోని ప్ర‌ధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ లు ముమ్మ‌రంగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నాయి. మొదట ఢిల్లీ, ఆ త‌ర్వాత పంజాబ్ లో తిరుగులేని విజ‌యంతో అధికార పీఠం ద‌క్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు చేస్తోంది.  ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ ఆగ్ర నాయ‌క‌త్వం వ‌రుస ప్ర‌చార ర్యాలీలు నిర్వ‌హిస్తూ ఓట‌ర్ల‌ను త‌మ‌వైపున‌కు తిప్పుకోవ‌డానికి ప్ర‌యత్నాలు చేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ సైతం ఈ సారి విజ‌యం పై ధీమా వ్య‌క్తం చేస్తోంది. ర్యాలీలు, బ‌హిరంగా స‌భ‌లు నిర్వ‌హిస్తోంది. సోమ‌వారం నుంచి రాహుల్ గాంధీ సైతం గుజ‌రాత్ లో ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీల్లో పాలుపంచుకోనున్నార‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios