Gujarat : గుజరాత్ కు చెందిన ఓ ఆప్ నాయకుడిపై హత్యాయత్నం కేసు నమోదైంది. పోలీసులతో గొడవపడి.. వారి నుంచి పారిపోయే క్రమంలో కారు ముందు భాగంపై ఓ కానిస్టేబుల్ ను ఉన్నప్పటికీ కొంత దూరం వరకు అలాగే కారును పోనిచ్చాడు. పోలీసులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు.
Aam Aadmi Party: డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసి, అనంతరం అక్కడి నుంచి పారిపోయే క్రమంలో కారు ముందుభాగం ఒక కానిస్టేబుల్ ఉన్నప్పటికీ.. వాహనాన్ని కొంత దూరం పోనిచ్చిన ఘటనలో గుజరాత్ ఆప్ యువజన విభాగం నాయకుడు యువరాజ్‌సింగ్ జడేజాను పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై హత్యాయత్నం కింద కేసు నమోదుచేశారు. ఆయనపై ఇతర ఆరోపణలతో ఉన్న క్రమంలో మంగళవారం రాత్రి గాంధీనగర్ పోలీసులు అరెస్టు చేసిన జడేజాపై IPC సెక్షన్ 307 కింద హత్య ప్రయత్నం కేసు నమోదు చేశాడు. అతని చర్యలు ఓ కానిస్టేబుల్ మరణానికి దారితీసే అవకాశం కల్పించే విధంగా ఉన్నాయని ఇన్‌స్పెక్టర్ జనరల్ (గాంధీనగర్ రేంజ్) అభయ్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడిని స్థానిక కోర్టు ముందు హాజరుపరిచారు, పోలీసులు అతనిని రిమాండ్ కోరకపోవడంతో జ్యుడిషియల్ కస్టడీ కింద జైలుకు పంపినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎంకె రాణా తెలిపారు.
పోలీసులు తెలిపిన మరిన్న ఇవివరాలు ఇలా ఉన్నాయి... సహాయక పాఠశాల ఉపాధ్యాయులు లేదా విద్యాసహాయకుల పోస్టుల కోసం పలువురు నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే వారికి మద్దతు ఇచ్చేందుకు ఆప్ యువజన విభాగం నాయకుడు యువరాజ్ సింగ్ జడేజా మంగళవారం సాయంత్రం గాంధీనగర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చి వారికి మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే నిరసనలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయితే, పోలీసులతో వాగ్వాదానికి దిగిన కొంత సమయం తర్వాత.. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేశాడని తెలిపారు. దీంతో ఘటనాస్థలికి మరింత మంది పోలీసులు వచ్చారు. దీంతో అక్కడి నుంచి పారిపోవడానికి యువరాజ్ సింగ్ జడేజా ప్రయత్నించాడు. కారును అక్కడి నుంచి వేగంగా పోనిచ్చాడు. అయితే, కారును ఆపడానికి ప్రయత్నించిన ఓ కానిస్టేబుల్ పైకి అలానే పోనిచ్చాడు. ఆ కానిస్టేబుల్ కారు ముందుభాగంలో వేలాడుతూ ఉన్నప్పటికీ.. ప్రమాదకర స్థాయిలో కారును కొంత దూరం అలానే పోనిచ్చాడు ఆప్ నాయకుడు.
వేగంగా వెళ్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు కానిస్టేబుల్ లక్ష్మణ్.. వాహనం ముందుభాగంపైకి దూకాడని పోలీసులు తెలిపారు. కొంత దూరం వెళ్లిన తర్వాత కారు ఆపాడని తెలిపారు. ఈ ఘటన మొత్తం జడేజా కారులోని డాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనలో కానిస్టేబుల్ చనిపోయి ఉండవచ్చు.. లేదా తీవ్రంగా గాయపడి వుండవచ్చు.. అదృష్టం కొద్ది ఎలాంటి దుర్ఘటన జరగలేదని తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి కారు డాష్ కెమెరాతో పాటు జడేజా మొబైల్ ఫోన్‌లను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపాము" అని ఇన్‌స్పెక్టర్ జనరల్ చెప్పారు.
కాగా, ఈ ఘటనపై స్పందించిన ఆప్ గుజరాత్ నాయకుడు ప్రవీణ్ రామ్.. బీజేపీ సర్కారు జడేజాకు భయపడుతోందనీ, కావాలనే ఆయనను కేసుల్లో ఇరికిస్తున్నారని తెలిపారు. తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేయగా.. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని ప్రభుత్వ అధికార ప్రతినిధి అయిన గుజరాత్ విద్యా మంత్రి జితు వాఘాని అన్నారు. ఇదిలావుండగా, ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో అక్రమాలను బయటపెట్టిన తర్వాత జడేజాకు రాష్ట్రంలో మంచి గుర్తింపు వచ్చింది. అవకతవకలు మరియు పేపర్ లీక్‌పై అతని ఫిర్యాదుల ఫలితంగా గత కొన్ని నెలల్లో క్లర్క్‌ల రిక్రూట్‌మెంట్ కోసం రెండు పరీక్షలు రద్దు చేయబడ్డాయి.
