గాంధీనగర్: ఓ మహిళా క్లాస్ టీచర్ ఎనిమిదో తరగతి విద్యార్థితో లేచిపోయింది. ఈ మేరకు గాంధనగర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. 26 ఏళ్ల క్లాస్ టీచర్ ఎనిమిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడితో పరారైనట్లు ఆ ఫిర్యాదులో తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎనిమిదో తరగతి చదువుతున్న తన కుమారుడు కనిపించడం లేదని గాంధీనగర్ ఉద్యోగ భవన్ లో పనిచేస్తున్న వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళా టీచర్ బాలుడితో ఏడాది కాలంగా అత్యంత సన్నిహితంగా ఉంటోందని పోలీసులు చెబుతున్నారు శుక్రవారంనాడు వారిద్దరు వెళ్లిపోయారని అంటున్నారు. 

గాంధీనగర్ జిల్లాలోని కాలోల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని వారి కోసం గాలిస్తున్నారు. టీచర్ స్వస్థలం కలోల్ పట్టణంలోని దర్బారీగా తెలుస్తోంది.

తాను సాయంత్రం 7 గంటలకు ఇంటికి చేరుకున్నానని, అయితే తన కుమారుడు కనిపించలేదని, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అతను ఇంటి నుంచి వెళ్లిపోయాడని తన భార్య తనతో చెప్పిందని బాలుడి తండ్రి అంటున్నాడు. 

తమ కుమారుడి కోసం తమ ఇంటి ఇరుగుపొరుగువారిని, బంధువులను సంప్రదించామని, అయితే తమ వద్దకు రాలేదని వారు చెప్పారని ఆయన ఎఫ్ఐఆర్ లో చెప్పాడు. తాను టీచర్ ఇంటికి కూడా వెళ్లానని, వారు అక్కడ కూడా లేరని అన్నాడు. ఇద్దరి వద్ద సెల్ ఫోన్స్ లేకపోవడంతో వారిని పట్టుకోవడం పోలీసులకు గగనంగా మారింది.