సొంత మేనల్లుడి పెళ్లి జరుగుతోంది. ధూం ధాం చేయాలని ఆశ పడ్డాడు. కానీ ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది కదా... సామాజిక దూరం పాటించాలని అందరూ అనుకున్నారు. దీనిలో భాగంగా వరుడి ఊరేగింపుకి మేన మామని దూరం పెట్టారు. దీంతో.. మనస్థాపం చేసిందిన వరుడి మామ.. చెయ్యి కోసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ జిల్లా అహ్రౌరా పోలీస్ స్టేషన్ ప్రాంతం ప‌రిధిలో జ‌రిగింది. అహ్రౌరాడీహ్‌కు చెందిన వ‌రుడు ఓంప్రకాష్ ఊరేగింపుగా చందౌలి జిల్లాకు బ‌య‌లుదేరాడు.అయితే లాక్‌డౌన్ నియ‌మాలు, సామాజిక దూరం పాటించాల్సిన కార‌ణంగా ఊరేగింపులో ఐదుగురు మాత్ర‌మే పాల్గొనాల‌ని నిర్ణయించుకున్నారు. 

ఇంత‌లో వ‌రుని మామ తానూ వ‌స్తానంటూ ప‌ట్టుబ‌ట్టాడు. దీంతో పెళ్లి పెద్ద‌లు ఎంత న‌చ్చ‌చెప్పినా అత‌ను విన‌లేదు. పైగా వారంతా త‌న‌ను దూరంపెడుతున్నార‌ని భావించి, ప‌దునైన క‌త్తితో చెయ్యి తెగ్గోసుకున్నాడు. దీనిని గ‌మ‌నించిన అక్క‌డున్న‌వారు బాధితుడిని వెంట‌నే స‌మీపంలోని ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. 

ఆయన ఆస్పత్రిలో నొప్పితో బాధపడుతున్నాడని.. పెళ్లి ఊరేగింపు వాయిదా వేయాలని వరుడు పట్టుపట్టడం గమనార్హం. అయితే.. ఇతర పెళ్లి పెద్దలు నచ్చచెప్పడంతో.. ఊరేగింపు.. ఆ తర్వాత పెళ్లి నిరాటంకంగా జరిగిపోయాయి.