ఇదో వింత పెళ్లి.. అమ్మాయిని చూడకుండా పెద్దగా విషయాలు తెలియకుండా మధ్యవర్తిని నమ్మి పెళ్ళి పెట్టకున్నారు అబ్బాయి తరఫు వాళ్లు. తీరా పెళ్లి మండపానికి వెళ్లేసరికి వధువు మాయమయ్యింది. రోజంతా ఎదురుచూసి చివరికి ఎలా వచ్చారో.. అలాగే ఇంటిదారి పట్టారు వరుడి తరఫు వాళ్లు..

ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెడితే.. అజాంగఢ్‌ కొత్వాలి ప్రాంతం కాన్షిరాం కాలనీకి చెందిన యువకుడికి, పక్క గ్రామం యువతితో వివాహం నిశ్చయమయ్యింది. ఇరు కుటుంబాల మధ్య ఓ మహిళ మధ్యవర్తిగా ఈ వివాహ ప్రతిపాదన తీసుకువచ్చింది. 

రెండు కుటుంబాలకు అంగీకారం కావడంతో ఈ నెల 10న వీరిద్దరికి పెళ్లి పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో 10వ తేది రాత్రి యువకుడు బరాత్‌గా పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు. అయితే ఎంతో సంతోషంగా వచ్చిన వరుడికి షాక్‌ తగిలింది. పెళ్లి కూతురు మాయమయ్యింది. వధువు కనిపించడం లేదనే వార్త వినిపించింది. దాంతో ఆమె కోసం చుట్టుపక్కల మొత్తం వెదికారు. 

వధువు తిరిగి వస్తుందని వరుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు రాత్రంతా వధువు ఇంటి దగ్గరే ఉన్నారు. అయినప్పటికి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వరుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కోపంతో ఈ వివాహ ప్రతిపాదన తీసుకువచ్చిన మహిళను బందీంచారు. 

అయతే పెళ్లి తేదీకి ముందు వరకు కూడా వరుడుకానీ, అతడి కుటుంబ సభ్యులు అమ్మాయి ఇంటికి వెళ్లలేదని పోలీసుల విచారణలో తెలిసింది. అంతేకాదు పెళ్లి ఏర్పాట్ల కోసం యువతి తన కుటుంబం నుంచి 20 వేల రూపాయలు తీసుకుందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. 

ఈ వింత కేసులో ఏం చెప్పాలో తెలియని పోలీసులు ఇరు వర్గాలు కాంప్రమైజ్‌ అయ్యి వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమయంలో వివాహ ప్రతిపాదనను తీసుకువచ్చిన మహిళపై వరుడి కుటుంబం తీవ్రమైన ఆరోపణలు చేసిందని కొత్వాలి పోలీస్ స్టేషన్ సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ షంషర్ యాదవ్ తెలిపారు.