గంపెడు ఆశలతో వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కారు. జీవితాంతం తోడుగా ఉండాలని.. నూరేళ్ల జీవితం సంతోషంగా గడపాలని ఆశపడ్డారు. కానీ.. వారి ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి. పెళ్లి జరిగిన కొద్ది గంటలకే వరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రామనాథపురం జిల్లా ఇళంజసోంబూరుకు చెందిన మలైస్వామి కుమారుడు విఘ్నేశ్వరన్‌ (27)కు సాయల్‌కుడికి చెందిన యువతితో గురువారం ఉదయం  వివాహం జరిగింది.  వివాహం అనంతరం వధువు ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విఘ్నేశ్వరన్‌ హఠా త్తుగా గుండె పోటుకు గురై స్పృహ తప్పి పడిపోయాడు. 

అతడిని వెంటనే సాయల్‌కుడి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. వివాహం జరిగిన రోజునే వరుడు మృతిచెందడంతో ఇరు కుటుంబాల్లో విషాధఛాయలు అలుముకున్నాయి. అంత చిన్న వయసులో గుండె పోటు రావడం పట్ల అందరూ విస్మయం వ్యక్తం చేశారు. వధువు పరిస్థితిని చూసి అందరూ జాలి పడుతుండటం గమనార్హం.