దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఎవరికి ఎక్కడ ఎలా కరోనా సోకుతోందో అస్సలు తెలియడం లేదు. తాజాగా.. ఓ యువకుడు పెళ్లైన రెండు రోజులకే కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన బీహార్ రాష్ట్రంలోని పాలిగంజ్ పట్టణ సమీపంలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. బీహార్ కు చెందిన 30 ఏళ్ల వరుడు గురుగ్రామ్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేసేవాడు.యువకుడు పెళ్లి చేసుకునేందుకు మే 12వతేదీన తన స్వగ్రామానికి వచ్చాడు. ఈ సమయంలో యువకుడికి కరోనా సోకింది.

వివరాల్లోకెళితే.. ఆ యువకుడు పాలిగంజ్ సమీపంలోని ఓ గ్రామంలో జూన్ 15 వతేదీన ఓ యువతిని వివాహమాడారు. వివాహం చేసుకున్న రెండు రోజులకే వరుడి ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని పట్నాలోని ఎయిమ్స్ కు తీసుకువెళుతుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. వరుడి బంధువులు అతని మృతదేహాన్ని దహనం చేశారు. పెళ్ళిలో కోవిడ్ నియమాలను ఉల్లంఘించారు. పెళ్లికి వచ్చిన అతిథులకు కరోనా పరీక్షలు చేయగా వారిలో 95 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా వధువుకు కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ అని వచ్చింది. జిల్లా అధికారులు అప్రమత్తమై వారందరినీ క్వారంటైన్ కు తరలించారు.