ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. చాలా కాలం తర్వాత మంచి ముహూర్తాలు రావడంతో.. వరసగా అందరూ పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. అయితే.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. అతి తక్కువ మంది అతిథుల మధ్య వివాహాలు జరిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సాధారణంగా పెళ్లిలో.. వరుడు కాళ్లకు వధువు నమస్కారం చేయిస్తారు. తాళి కట్టిన తర్వాత.. వరుడి కాళ్లకి వధువు నమస్కారం చేస్తే.. అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు. అయితే.. ఓ పెళ్లిలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఓ వరుడు .. పెళ్లి తర్వాత తాను తాళికట్టిన భార్య కాళ్లు మొక్కాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటో వైరల్ కాగా.. అతను అలా ఎందుకు చేశాడో చెప్పిన కారణానికి ఇప్పుడు అందరూ ఫిదా అయిపోతున్నారు. 

వివాహ తంతు పూర్త‌య్యి పెండ్లి కొడుకు, పెండ్లి కూత‌రు దండ‌లు మార్చుకుంటున్న స‌మ‌యంలో పెండ్లి కొడుకు అక‌స్మాత్తుగా పెండ్లి కూతురు కాళ్ల‌పై ప‌డ్డాడు.

ఈ అనూహ్య ప‌రిణామానికి ఫంక్షన్‌కు హాజ‌రైన బంధు మిత్రులంతా ఆశ్య‌ర్చ‌పోయారు. అయితే అతడు ఇలా చేయడానికి ఓ కారణం ఉందంట.. త‌న వంశాన్ని అభివృద్ధి చేయ‌డానికి వ‌స్తున్న‌ది కాబ‌ట్టి ఆమె కాళ్ల‌కు దండం పెట్ట‌డం త‌న బాధ్య‌త అన్నాడు. త‌నను క‌న్న‌వాళ్ల‌ను, తోబుట్టువుల‌ను వ‌దిలి నాకోసం, తన సంతోషం కోసం మా ఇంట్లో అడుగుపెట్ట‌బోతున్న ఆమె కాళ్ల‌కు దండం పెట్ట‌డంలో త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించాడు. ప్ర‌స్తుతం వ‌రుడు వ‌ధువు కాళ్ల‌పైప‌డ్డ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అతను చెప్పిన కారణం విని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.