జమ్ము కశ్మీర్‌లో తీవ్రవాదులు రద్దీగా ఉన్న ఓ మార్కెట్‌లో గ్రెనేడ్ బాంబు విసిరేశారు. ఈ ఉగ్రదాడిలో ఒకరు మరణించారు. కాగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని స్థానిక పార్టీలు తీవ్రంగా ఖండించాయి.
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లో రద్దీగా ఉన్న మార్కెట్లో ఓ టెర్రరిస్టు గ్రెనేడ్ బాంబు విసిరేశారు. ఆదివారం సాయంత్రం నాలుగన్నర గంటల ప్రాంతంలో మార్కెట్లో బాంబు విసిరారు. వీకెండ్ కావడంతో పెద్దమొత్తంలో ప్రజలు ఆ మార్కెట్లో ఉన్నారు. ఈ ఉగ్ర దాడిలో ఒకరు మరణించారు. 20 మంది గాయపడ్డారు. కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు చెప్పారు. శ్రీనగర్‌కు చెందిన 71 ఏళ్ల మొహమ్మద్ అస్లాం మఖ్దూమీ మరణించినట్టుగా అధికారులు ధ్రువీకరించారు.
కాగా, క్షతగాత్రులను శ్రీ మహారాజ హరి సింగ్ హాస్పిటల్‌కు తరలించారు. అందులో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటనపై సీనియర్ పోలీసు అధికారి రాకేశ్ బల్వాల్ మాట్లాడుతూ, ఆదివారం సాయంత్రం భారీగా జనసందోహం ఉన్నదని, అదే సమయంలో ఓ ఉగ్రవాది గ్రెనేడ్‌ను విసిరాడని తెలిపారు. ఈ దాడిలో 71 ఏళ్ల వృద్ధుడు స్పాట్‌లోనే మరణించాడని, మరో యువతి తీవ్రంగా గాయపడిందని వివరించారు. గాయపడ్డ 20 మందిలో పోలీసులూ ఉన్నట్టు పేర్కొన్నారు.
ఈ ఘటన చోటుచేసుకోగానే సెక్యూరిటీ ఫోర్సెస్ స్పాట్‌కు చేరుకుంది. గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్ తరలించారు. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమీప ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. గాలింపు ప్రక్రియను ప్రారంభించినట్టు అధికారులు చెప్పారు.
ఈ ఘటనపై జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ స్పందించారు. ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ దాడులకు జమ్ము కశ్మీర్ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తున్నదని, దీన్ని అడ్డుకోవడానికి ఇటు ఇండియా, అటు పాకిస్తాన్ దేశాలు ఏమీ చేయడం లేదని పేర్కొన్నారు. ఈ రక్తపాతాన్ని ఆపడానికి చర్యలు తీసుకోవడం లేదని ఆరపించారు. మరణించిన వారి కుటుంబ సభ్యలు, ఆప్తులకు తన ప్రగాఢ సంతాపం అని ప్రకటించారు.
ఈ హీనమైన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు మరో మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఈ దాడులు ప్రాణాలు కోల్పోయినవారికి జన్నత్‌లో చోటుదక్కుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. గాయపడ్డ వారు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. కాగా, పీపుల్స్ కాన్ఫరెన్స్, జమ్ము కశ్మీర్ అప్ని పార్టీ, బీజేపీలూ ఈ ఉగ్రదాడిని ఖండించారు.
జమ్మూ కాశ్మీర్ ఆర్ఎస్ లోని ట్రెవా గ్రామంలో డ్రోన్ ద్వారా జారవిడిచిన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జమ్మూలోని పురాలోని అర్నియా సెక్టార్‌లో గతనెల చోటు చేసుకుంది. ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా (LeT), ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)లు డ్రోన్ల్ (Drone) ద్వారా మూడు బాక్సుల్లో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని జారవిడిచినట్లు తమకు సమాచారం ఉందని పోలీసులు చెప్పారు.
పురా అర్నియా (Pura Arnia) ప్రాంతంలో నిర్వహించిన సెర్చ్ ఆపరేషన లో పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) మూడు బాక్సుల నుంచి మూడు డిటోనేటర్లు, మూడు రిమోట్ కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలు (ied), మూడు బాటిల్ పేలుడు పదార్థాలు, ఒక బండిల్ కార్డ్‌టెక్స్ వైర్, రెండు టైమర్ ఐఈడీలు, ఒక పిస్టల్, రెండు మ్యాగజైన్‌లు, ఆరు గ్రెనేడ్‌లు, 70 రౌండ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ రికవరీ ద్వారా మిలిటెంట్ల వ్యూహం బెడిసికొట్టినట్టు అయ్యాయి.
