ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్షకు సమయానికి అందుకోలేకపోతోందని గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసిన ఘటన పశ్చిమబెంగాల్ లో చోటు చేసుకుంది.
పశ్చిమబెంగాల్ : గ్రీన్ కారిడార్.. ఈమధ్య తరచుగా వినిపిస్తున్న పదం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని రక్షించడానికి.. అవయవదానం చేసిన బ్రెయిన్ డెడ్ పేషెంట్లు ఇచ్చిన ఆర్గాన్స్ ను సమయానికి మరో పేషెంట్ కి అందించడానికి… ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తుంటారు. అయితే పశ్చిమ బెంగాల్ లో పరీక్ష రాసే ఓ విద్యార్థి కోసం గ్రీన్ కారిడార్ని ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయ్యింది. పదవ తరగతి పరీక్ష రాసే ఓ విద్యార్థి కోసం అక్కడి పోలీసులు గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేసి.. సరైన సమయానికి ఆ విద్యార్థినిని పరీక్ష హాలుకు చేర్చారు. కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెడితే..
పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో ఓ విద్యార్థిని ఎగ్జామ్ హాలుకు చేరుకునేందుకు గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. దీని వెనుక ఓ మానవీయత కోణం ఉండడం అందరినీ మెచ్చుకునేలా చేస్తుంది.. హావ్ డా వంతెన సమీపంలో రద్దుగా ఉన్న రోడ్డుపై ఓ విద్యార్థిని స్కూల్ యూనిఫామ్ వేసుకుని కనిపించింది. ఆమె ఏడుస్తూ అందరినీ సహాయమడుగుతోంది. తనకు సాయం చేయాల్సిందిగా అందరిని బతిమాలుకుంటుంది. అయినా ఎవరూ ఆమె మాటలు వినిపించుకోవడం లేదు.
Bharat Jodo yatra 2.0: భారత్ జోడో యాత్ర 2.0 ను ప్రారంభించాలనుకుంటున్నాం: జైరాం రమేశ్
చాలాసేపటి నుంచి అలా జరుగుతుండడం చూసిన అక్కడి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చక్రవర్తి విషయం ఏంటో తెలుసుకుందామని ఆమె దగ్గరికి వచ్చాడు. అతను ఆ రోజు అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. ఎందుకు అలా ఏడుస్తున్నావ్ అంటూ ఆ విద్యార్థినిని ప్రశ్నించాడు. ఆమె చెప్పింది విని అతని హృదయం ద్రవించింది. తాను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేందుకు వెళుతున్నానని.. శాయంబజార్ లోని ఆదర్శ శిక్షానికేతన్ పరీక్షా కేంద్రానికి వెళ్లాలని తెలిపింది. అయితే సమయానికి తాను వెళ్లలేక పోతున్నానని, అందుకే అందరిని సహాయం కోరుతున్నానని చెప్పింది.
ఇంట్లో వాళ్ళు ఎవరినైనా తోడు తీసుకుని రావాల్సింది.. పరీక్ష హాల్దాకా వదిలేయమని అడగాల్సింది అని.. ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయితో అనగా.. తన తాత చనిపోయాడని… కుటుంబ సభ్యులందరూ ఆయన అంత్యక్రియల్లో ఉన్నారని.. తాను మాత్రం ఎగ్జామ్ రాయడానికి వెళుతున్నానని తెలిపింది. దీంతో ఆ ఇన్స్పెక్టర్ హృదయం దయతో నిండిపోయింది.. అంతే ఆ విద్యార్థినిని సరైన సమయానికి పరీక్ష హాలుకు చేర్చడం కోసం తన అధికారిక వాహనంలోకి ఎక్కించుకున్నారు. మిగతా వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ పరీక్షా కేంద్రం వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సరిగా ఉదయం 11:30 గంటలకు విద్యార్థిని పరీక్షా కేంద్రం దగ్గర విడిచిపెట్టారు. సమయానికి చేరుకోవడంతో విద్యార్థిని పరీక్ష రాయగలిగింది.
