పగ తీర్చుకోవాలన్న కసి ఆ బామ్మలో విచక్షణను చంపేసింది. తన మూడేళ్ల మనవరాలినే దారుణంగా చంపేసింది. ఈ ఘటన రాజస్థాన్ లోని బరన్ లో జరిగింది. 

తన విరోధికి ఎలాగైన బుద్ది చెప్పాలనుకున్న ఓ వృద్ధురాలు తన కుటుంబంలోనే నిప్పులు పోసుకుంది. విచక్షణ కోల్పోయిన ఆమె తన శత్రువుమీద పగ తీర్చుకునే క్రమంలో మూడేళ్ల వయసున్న తన మనవరాలిని ఆమె బలి తీసుకుంది. రాజస్థాన్ బరన్ జిల్లాలలో ఈ దారుణం జరిగింది.

బోరినా గ్రామానికి చెందిన కనకబాయ్, ఆమె కుటుంబసభ్యులకు అదే గ్రామానికి చెందిన రామేశ్వర్ మోగ్యా కుటుంబానికి మధ్య నీళ్ల విషయం మీద కొన్ని విభేదాలు ఉండేవి. రెండు నెలల క్రితం ఇరు వర్గాల మధ్య ఈ విషయమై పెద్ద గొడవ జరిగింది. 

ఇందులో కనకబాయి మనవరాలితో పాటు రామేశ్వర్ మోగ్యా కూతురు కూడా గాయపడింది. ఆ తరువాత పోలీసు కేసు పెడతానంటూ కనకబాయి రామేశ్వర్ మోగ్యాను బెదిరించింది. దీంతో అతడు పారిపోయాడు. 

ఈ క్రమంలో కనకబాయ్ తన మనవరాలిని చంపేసి రామేశ్వర్ మోగ్యామీద ఈ నేరాన్ని నెట్టేసింది. పోలీసు కేసు కూడా పెట్టింది. అయితే దర్యాప్తు చేపడుతున్న పోలీసులకు కనకబాయ్ తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో వారు ఆమెను తమదైన శైలిలో ప్రశ్నించగా జరిగిన దారుణం గురించి వెలుగులోకి వచ్చింది. దీంతో వారు నిందితురాలిని అరెస్ట్ చేశారు.