ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ఒడిషా పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సమావేశమైన ఆయన ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించారు.

ఇవాళ ఉదయం భువనేశ్వర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా పూరీ జగన్నాథ్ దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ కేసీఆర్‌కు ఆలయ అధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. సీఎం వెంట ఆయన కుటుంబసభ్యులు కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా జగన్నాథ స్వామికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రఖ్యాత కోణార్క్ సూర్యదేవాలయాన్ని కూడా ముఖ్యమంత్రి సందర్శించనున్నారు.

యాత్ర ముగించుకున్న తర్వాత కేసీఆర్ తిరిగి భువనేశ్వర్‌కు చేరుకుని భోజనం చేస్తారు. ఆ తర్వాత భువనేశ్వర్ నుంచి కోల్‌కతా వెళతారు. సాయంత్రం నాలుగు గంటలకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కేసీఆర్‌‌ సమావేశమవుతారు. నగరంలోని ప్రఖ్యాత కాళీమాత దేవాలయాన్ని దర్శించి.. రాత్రికి ఢిల్లీ వెళతారు.