అహ్మదాబాద్: గుజరాత్ లో విచిత్రమైన సంఘటన జరిగింది. 19 ఏళ్ల అమ్మాయి పొరుగింటి తాతయ్యతో పారిపోయింది. విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయితే, పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించడంతో హైకోర్టుకు ఎక్కారు.

యువతి ఆచూకీ కోసం వారు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.... తమ పొరుగింటి వ్యక్తి షోవాంజీ ఠాకూర్ తన సోదరిని బలవంతంగా ఎత్తుకెళ్లి నిర్బంధించాడని, పోలీసులు ఈ కేసును సాధారణంగా తీసుకున్నారని యువతి సోదరుడు అన్నాడు. 

గత నెల 22వ తేదీన కేసు విచారణకు వచ్చింది. యువతిని తీసుకుని వెళ్లిన ఠాకూర్ పెద్ద కూతురికి పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న విషయాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకుని వెళ్లాడు. యువతిని గాలించి తీసుకుని వచ్చి కోర్టు ఎదుట హాజరు పరచాల్సిందిగా కోర్టును ఆదేశించాలని కోరారు. 

బాధిత కుటుంబ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపిన వివరాలు ప్రకారం... యువతి గత నెల 2వ తేదీన కనిపించకుండా పోయింది. ఎంత గాలించినా ఫలితం కనిపించలేదు. దాంతో పొరుగింటి తాతయ్య తీసుకుని వెళ్లాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాతయ్యతో వెళ్లింది బాలిక కాదు కాబట్టి మైనారిటీ తీరిన యువతి కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకోవడానికి నిరాకరించారు. 

యువతి భవిష్యత్తు ప్రమాదంలో ఉందని, ఆమె లైంగికంగా వేధింపులకు గురి అవుతుండవచ్చునని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసును విచారించిన కోర్టు జూన్ 29వ తేదీన హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. 

యువతిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, తమకు కొంత సమయం కావాలని ఆ తదుపరి వివాచరణలో పోలీసులు కోర్టుకు తెలిపారు. దాంతో ఈ నెల 13వ తేదీ వరకు కోర్టు పోలీసులకు సమయం ఇచ్చింది.