న్యూఢిల్లీ: ఏడాదిన్నర పాటు కొత్త వ్యవసాయ చట్టాలను నిలిపివేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రకటించారు.

బుధవారం నాడు న్యూఢిల్లీలో రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రి చర్చించారు. సుధీర్ఘంగా రైతు సంఘాల ప్రతినిధులతో మంత్రి చర్చించారు.

రైతులు, ప్రభుత్వ ప్రతినిధులతో ఉమ్మడిగా కమిటీ వేసి వ్యవసాయ చట్టాల్లో ఉన్న అభ్యంతరాలపై అధ్యయనం చేస్తామని కేంద్రం తెలిపింది. ఈ కమిటీ వేసి నివేదిక వేసి సాగు చట్టాల అమలును ఈ ఏడాది నుండి ఏడాదిన్నర వరకు వాయిదా వేసేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్రం తెలిపింది. 

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం ముందు రైతు సంఘాల ప్రతినిధులు ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల విషయమై రైతు సంఘాల ప్రతినిధులు ఈ నెల 21వ తేదీన సింగ్రి వద్ద సమావేశమై చర్చించనున్నారు. 

ఈ నెల 22వ తేదీన మరోసారి రైతు సంఘాలతో చర్చించనున్నట్టుగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. రైతు సంఘాలతో చర్చలు ముగిసిన తర్వాత  బుధవారం నాడు రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. 

తమ ప్రతిపాదనపై ఈ నెల 22న తమ నిర్ణయాన్ని తెలుపుతామని రైతు సంఘాలు ప్రకటించారు. చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు. 

ఈ నెల 22న ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

చట్టాల అమలు నిలిపివేత ప్రతిపాదనపై కేంద్రం లిఖితపూర్వంగా హమీ ఇవ్వాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. కేంద్రం ప్రతిపాదనపై తాము చర్చించుకొని నిర్ణయం చెబుతామన్నారు.