న్యూఢిల్లీ:కరోనా కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి 31 వరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించింది ఇండియా. ఇప్పటికే బ్రిటన్ విమానాలపై ఇండియా నిషేధం విధించిన విషయం తెలిసిందే.

అంతర్జాతీయంగా తిరిగే కార్గో విమాన సర్వీసులపై ఎలాంటి ఆంక్షలు లేవని డీజీసీఏ బుధవారం నాడు ప్రకటించింది. ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ షెడ్యూల్ విమానాలను అనుమతించవచ్చని డీజీసీఏ బుధవారం నాడు తెలిపింది.

కరోనాను పురస్కరించుకొని ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ విమానాలను మార్చి 23 వ తేదీ నుండి నిలిపివేశారు. విదేశాల్లో ఉన్న ఇండియన్లను భారత్ కు రప్పించేందుకు గాను ఈ ఏడాది మే మాసంలో వందేభారత్ మిషన్ కింద ప్రత్యేక విమానాలను కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది జూలై నుండి అంతర్జాతీయ విమానాలను కేంద్రం అనుమతి ఇచ్చింది. కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ బ్రిటన్ లో వెలుగు చూసింది. బ్రిటన్ తో పాటు  ఇతర దేశాల్లోకి ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది.

ఇండియాలో మంగళవారంనాడు ఆరు కేసులు నమోదైతే, బుధవారం నాటికి ఈ కేసుల సంఖ్య 20కి చేరుకొంది.  నవంబర్ 25 నుండి డిసెంబర్ 23 వరకు దేశంలోకి 33 వేల మంది యూకే నుండి వచ్చారు. వీరి  కాంటాక్ట్ ట్రేసింగ్ లపై కూడ కేంద్ర ఆరా తీస్తోంది.