Asianet News TeluguAsianet News Telugu

GroundWater: విషపూరితమైన భూగర్భ జలాలు.. దేశంలో 80% జనాభాకు విషపు నీరే!.. షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించిన కేంద్రం

Contaminated Water in India: దేశంలో నీటి నాణ్యత క్షీణిస్తోంది. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోని జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో నిర్దేశిత ప్రమాణాల కంటే భూగర్భ జలాల్లో విషపూరిత లోహాల పరిమాణం ఎక్కువగా ఉన్నట్లు తేలిందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. దేశంలోని 209 జిల్లాల్లో భూగర్భ జలాల్లో ఆర్సెనిక్‌, 491 జిల్లాల్లో ఇనుము అధికంగా ఉన్నట్లు గుర్తించామని ప్రభుత్వం వెల్లడించింది. వీటితో పాటు సీసం, యురేనియం, క్రోమియం, కాడ్మియం వంటివి కూడా భూగర్భ జలాల్లో ఉన్నట్లు గుర్తించారు.

Govt data shows toxic metals in groundwater
Author
Hyderabad, First Published Aug 3, 2022, 5:50 AM IST

Contaminated Water in India: మనిషి సజీవంగా ఉండాలంటే తాగునీరు చాలా ముఖ్యం. మన శరీరంలో 66% నీరు ఉంటుంది. మన మెదడు 75% నీరు, మన ఎముకలు 25%, మన రక్తంలో 83% నీరు ఉంటాయి. ఒక వ్యక్తి ఆహారం లేకుండా ఒక నెల పాటు జీవించగలడు. కానీ నీరు లేకుండా నాలుగు రోజులు కూడా జీవించలేదు. ఒక వ్యక్తి తన జీవితాంతం సగటున 75,000 లీటర్ల నీరు తాగుతాడు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ కనీసం 3నుండి 4 లీటర్ల నీరు త్రాగాలి. అయితే..  నేడు మ‌నం తాగేనీరు మనల్ని ఆరోగ్యవంతుల‌ను చేస్తుందా? అంటే.. సమాధానం బహుశా లేద‌నే చెప్పాలి. 

ప్రస్తుతం మనం తాగుతున్న నీరు విషపూరితమని, ఇందులో విషపూరిత లోహాలున్నాయని  పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే ఆమోదించింది. రాజ్యసభలో కేంద్రం ప్రభుత్వం వెల్ల‌డించిన గ‌ణాంకాలు ప్ర‌తి ఒక్క‌రిని దిగ్భ్రాంతికిలోను చేయ‌డ‌మే కాకుండా.. భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు మనం తాగుతున్న నీరు 'విషపూరితం' అని కేంద్రం లెక్కలు మనల్ని భయపెడుతున్నాయి. ఎందుకంటే.. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో భూగర్భ జలాల్లో విషపూరిత  లోహాల పరిమాణం నిర్దేశించిన ప్రమాణం కంటే ఎక్కువగా ఉన్నట్లు, ఆర్సెనిక్‌, ఐరన్‌, కాడ్మియం, క్రోమియం, యురేనియం మోతాదులను మించి ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.  

జలశక్తి మంత్రిత్వశాఖ గణాంకాలు ఏం చెబుతున్నాయి?

 – 25 రాష్ట్రాల్లోని 209 జిల్లాల్లోని లీటరుకు నీటిలో 0.01 మి.గ్రా కంటే ఎక్కువ ఆర్సెనిక్ ఉంటుంది  .

– 29 రాష్ట్రాల్లోని 491 జిల్లాల్లోని లీటరుకు నీటిలో 1 మి.గ్రా కంటే ఎక్కువ ఐరన్ ఉంటుంది .

– 11 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లోని లీటరుకు నీటిలో కాడ్మియం  0.003 మి.గ్రా కంటే ఎక్కువగా ఉంటుంది.

– 16 రాష్ట్రాల్లోని 62 జిల్లాల్లోని లీటరుకు నీటిలో క్రోమియం 0.05 మి.గ్రా కంటే ఎక్కువగా ఉంటుంది.

– 18 రాష్ట్రాల్లోని 152 జిల్లాల్లోని  లీటరుకు నీటిలో యురేనియం 0.03 మి.గ్రా కంటే ఎక్కువగా ఉంటుంది.
 

80% జనాభాకు విషపు నీరు!

జల్ శక్తి మంత్రిత్వ శాఖ గ‌ణాంకాల ప్ర‌కారం... దేశంలో 80 శాతానికి పైగా జ‌నాభా భూగర్భం నుంచి వ‌చ్చే నీటినే తాగు నీటిగా వాడుతున్నారు. అయితే.. భూగర్భ జలాల్లో ప్రమాదక‌ర‌ లోహాలు.. నిర్దేశిత మోతాదు కంటే అధికంగా ఉంటే.. ఆ నీరు విషపూరితమేనని మంత్రిత్వ శాఖ చెప్తుంది. తాగునీటి వనరులు కలుషితమై ఉన్న నివాస ప్రాంతాల సంఖ్యను కూడా ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ప్రభుత్వ గ‌ణాంకాల ప్ర‌కారం.. ఫ్లోరైడ్(671), ఆర్సెనిక్‌(814), ఐరన్‌(14,079), సాలినిటీ(9,930), నైట్రేట్‌(517), ఇతర భారలోహాలు(111)తో ఆయా ప్రాంతాల్లో నీటివనరులు కలుషిత‌మ‌య్యాయి.

తాగునీటి వనరులు కలుషితమవుతున్న నివాస ప్రాంతాల సంఖ్యను కూడా కేంద్రం వెల్లడించింది. పట్టణాల కంటే గ్రామాల్లోనే ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఎందుకంటే భారతదేశ జనాభాలో సగానికి పైగా గ్రామాలలో నివసిస్తున్నారు. ఇక్కడ తాగునీటికి ప్రధాన వనరులు చేతి పంపులు, బావులు, నది-చెరువులు.  నీటిలోని మలినాలను తొలగించే వ్యవస్థ లేకపోవడంతో వారు ఆ కలుషిత నీటిని తాగాల్సివస్తోంది.  దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు విషపూరితమైన నీటిని తాగాల్సి వస్తోంది.

ఆరోగ్యానికి ప్రమాదకరం?

ఒక వ్యక్తి ప్రతిరోజూ సగటున 3 లీటర్ల నీరు తాగుతాం.. అయితే ప్రభుత్వ పత్రాల ప్రకారం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కనీసం 2 లీటర్ల నీరు తాగాలి. మీరు రోజూ 2 లీటర్ల నీరు తాగితే.. ఎంత‌ మొత్తంలో విషం కూడా వస్తుంది. భూగర్భ జలాల్లోని ఆర్సెనిక్, ఇనుము, సీసం, కాడ్మియం, క్రోమియం, యురేనియం నిర్దేశిత ప్రమాణం కంటే ఎక్కువగా ఉండటం వల్ల మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

>> ఆర్సెనిక్ అంటే చర్మ వ్యాధులు,  క్యాన్సర్ వచ్చే ప్రమాదం .

>> ఇనుము వ‌ల్ల‌ అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు వ‌స్తాయి.

>> సీసం మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

>> కాడ్మియం తీసుకుంటే..  మూత్రపిండాల వ్యాధులు
 
>> క్రోమియం తీసుకుంటే.. చిన్న ప్రేగులలో వ్యాపించే హైపర్‌ప్లాసియాకు కారణమవుతుంది, ఇది కణితుల ప్రమాదాన్ని పెంచుతుంది.

>> యురేనియం అధికంగా ఉండటం వల్ల కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

'విషం' తాగకుండా ప్రభుత్వం ఏం చేస్తోంది?

ప్రజలకు తాగునీరు అందించడం రాష్ట్రాల బాధ్యత అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చెప్పింది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు అనేక పథకాలు అమలు చేస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం 2019 ఆగస్టులో జల్ జీవన్ మిషన్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ మిషన్ కింద 2024 నాటికి ప్రతి గ్రామీణ కుటుంబానికి కుళాయిలు ద్వారా తాగునీరు సరఫరా చేస్తామని తెలిపింది. 

ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ప్రకారం.. ఇప్పటివరకు దేశంలోని 19.15 కోట్ల గ్రామీణ కుటుంబాలలో 9.81 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటిని సరఫరా చేస్తున్నట్టు తెలిపింది. ఇది కాకుండా.. అమృత్ 2.0 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 2021లో ప్రారంభించింది. దీని కింద వచ్చే 5 ఏళ్లలో అంటే 2026 నాటికి అన్ని నగరాలకు కుళాయి ద్వారా త్రాగు నీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios