Asianet News TeluguAsianet News Telugu

అక్ర‌మ రుణ యాప్స్ కు కేంద్రం చెక్.. క‌ట్ట‌డి చ‌ర్య‌లు ప్రారంభించిన ఆర్బీఐ

అక్ర‌మ డిజిట‌ల్ లోన్ యాప్స్ ఆగడాలు క‌డ్డుక‌ట్ట వేయాల‌నే దిశగా కేంద్ర ప్ర‌భుత్వం అడుగులేస్తుంది. ఈ క్ర‌మంలో దేశంలో సక్రమంగా నడుస్తున్న  రుణ‌ యాప్స్‌ జాబితా( వైట్ లిస్ట్)ను త‌యారు చేయాల‌ని ఆర్బీఐకి  కేంద్ర‌ ఆర్థిక శాఖ సూచించింది. ఈ జాబితాలో ఉన్న‌ యాప్స్‌ మాత్రమే.. గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో ఉండేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ చ‌ర్చ‌లు తీసుకోనున్న‌ది.

Govt cracks down on illegal loan apps
Author
First Published Sep 10, 2022, 11:09 AM IST

దేశంలో అక్ర‌మ డిజిట‌ల్ లోన్ యాప్స్  ఆగడాలు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ యాప్స్ మోసాల‌ను, వేధింపుల‌ను భ‌రించ‌లేక ఎంతోమంది అమాయ‌కులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం వాటి ఆగ‌డాల‌కు అడ్డుకట్ట వేసే దిశగా అడుగులేస్తుంది. ఆ యాప్స్ విష‌యాన్ని కేంద్రం తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది. ఈ క్ర‌మంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన అక్రమ ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్‌కు సంబంధించిన పలు అంశాలపై సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక, ఆర్థిక వ్యవహారాలు, రెవిన్యూ, ఆర్థిక సేవలు, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖల కార్యదర్శులతోపాటు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ హాజ‌రయ్యారు. ఈ స‌మావేశంలో కీలక నిర్ణయం తీసున్నారు.

అక్రమ యాప్‌లపై ఆర్థిక మంత్రి ఆందోళన  

ముఖ్యంగా బలహీన, అల్ప‌-ఆదాయ వర్గాల వారికి రుణాలు అంద‌జేసి.. అధిక వడ్డీల‌ను వ‌సూల్ చేయ‌డం. ఆ రుణాలను చెల్లించ‌లేని ప‌క్షంలో..  బ్లాక్‌మెయిలింగ్, క్రిమినల్ బెదిరింపు మొదలైన హింసాత్మక రికవరీ పద్ధతులపై ఆర్థిక మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతోమంది రుణ యాప్స్ కు బ‌ల‌వుతుంద‌డ‌టంపై మనీలాండరింగ్, పన్ను ఎగవేత, డేటా ఉల్లంఘన/గోప్యత,  క్రమబద్ధీకరించని చెల్లింపు అగ్రిగేటర్లు, షెల్ కంపెనీలు, నిద్రాణమైన NBFCలు మొదలైన వాటిని దుర్వినియోగం చేసే అవకాశాలను గుర్తించారు.

చట్టపరమైన, విధానపరమైన, సాంకేతిక అంశాలపై వివరణాత్మక చర్చల తర్వాత... ఆర్బీఐ(RBI) అక్ర‌మ  రుణ‌ యాప్స్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం సక్రమంగా నడుస్తున్న  రుణ‌ యాప్స్‌ జాబితా( వైట్ లిస్ట్)ను త‌యారు చేయాల‌ని ఆర్బీఐకి ఆర్థిక మంత్రి సూచించారు. ఈ వైట్ లిస్ట్ లోని యాప్స్‌ మాత్రమే.. గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో ఉండేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ చ‌ర్చ‌లు తీసుకోనున్న‌ది. దీంతో అక్రమ రుణ యాప్స్ గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో కనుమరుగుకనున్నాయి.  
    
నియంత్రణ లోపం వల్లే..

రుణ యాప్స్‌పై నియంత్రణ లోపం వల్లే చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ యాప్స్ పై నిఘా లోపాల ఉన్నాయ‌నే  విమర్శలు తీవ్ర‌త‌రమ‌వుతున్నాయి. మ‌రోవైపు .. ఆర్బీఐని అడ్డం పెట్టుకుని కేంద్రం ఈ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంద‌నే  ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. దేశంలో ప్ర‌స్తుతం చ‌లామ‌ణిలో చాలా  రుణ‌యాప్స్‌ అక్రమంగా నడుస్తున్నవేనని ప‌లు నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి. ఆర్బీఐతో సంబంధం లేకుండా సొంతంగానే రుణ లావాదేవీలు జరుపుతుండ‌టం వ‌ల్ల రుణ యాప్స్ వేధింపులను భరించలేక ఆత్మహత్యలకు పాల్ప‌డే వారి సంఖ్య రోజురోజుకు గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో కేంద్రం ఈ చ‌ర్య‌ల‌ను ప్రారంభించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios