న్యూఢిల్లీ: కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నట్టుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సార్క్ దేశాలతో ప్రధానమంత్రి మోడీ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 

శుక్రవారం నాడు న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో  మాట్లాడారుతెలంగాణ రాష్ట్రంలో 16, ఏపీ రాష్ట్రంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా ఆయన చెప్పారు. 

ఈ ఏడాది మార్చి 16 వ తేదీ నుండి కడ్తార్ పూర్ కారిడార్ ను కూడ మూసివేసినట్టుగా ఆయన తెలిపారు. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మయన్మార్‌ల నుండి ఇండియాకు వచ్చే వారి కోసం చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలిపారు. 20 చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన మార్గాల ద్వారానే ఇంటికి వచ్చేలా  జాగ్రత్తలు ఏర్పాటు చేశామన్నారు.

జనవరి 25వ తేదీ నుండి విమానాశ్రయాలను తనిఖీ చేస్తున్నామన్నారు. ప్రజలు ఎవరూ కూడ భయాందోళనలు చెందకూడదని మంత్రి సూచించారు. 

విదేశాల నుండి ఇండియాకు వచ్చే నౌకలను అనుమతించడం లేదని మంత్రి వివరించారు. విదేశాల నుండి ఇండియాకు వచ్చే  ప్రయాణీకులను  క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామని చెప్పారు.

అన్ని రాష్ట్రాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడ  కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.దేశ వ్యాప్తంగా 14 లక్షల 30 వేల మందికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు.

దేశ వ్యాప్తంగా కరోనా  వ్యాధి వల్ల నలుగురు మాత్రమే మరణించారని ఆయన చెప్పారు. దేశంలోని 69 వేల మందిపై నిఘా ఏర్పాటు చేశామన్నారు.