కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ ఆర్ఎస్ఎస్ చేతిలోనే ఉన్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందిరిపై ఉందని అన్నారు. వీటికి భయపడే బీఎస్పీ అధినేత మాయావతి దళితుల కోసం ఉత్తరప్రదేశ్ లో గొంతెత్తలేదని అన్నారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్)పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలన్నీ ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మలుగా మారాయని అన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం భారతీయులందరిపై ఉందని తెలిపారు. ఢిల్లీలోని జవహర్ భవన్‌లో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“ రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలి. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మన సంస్థలను కాపాడుకోవాలి. అయితే అన్ని దర్యాప్తు సంస్థలు ఆర్‌ఎస్‌ఎస్ చేతుల్లో ఉన్నాయి ’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నేత మాయవతికి సూచించాం. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థల భయంతో ఆమె దీనికి దూరంగా ఉందని అన్నారు. ‘‘ మాయావతి జీ ఎన్నికల్లో (ఉత్తరప్రదేశ్‌లో) పోరాడలేదు. కూటమి ఏర్పాటు చేయమని మేము ఆమెకు సందేశం పంపాము. కానీ ఆమె స్పందించలేదు. ఈసారి ఆమె దళితుల గొంతు కోసం పోరాడలేదు. ఎందు కంటే సీబీఐ, ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఉన్నాయని ఆమె భయపడ్డారు ’’ అని ఆయన అన్నారు.
తనకు అధికార సాధన పట్ల ఆసక్తి లేదని రాహుల్ గాంధీ అన్నారు. తాను దేశాన్ని ప్రేమిస్తానని అన్నారు. ‘‘ అధికారం కోసం పని చేసే రాజకీయ నాయకులు ఉన్నారు. వారు ఉదయాన్నే నిద్రలేచిన తరువాత మనం అధికారం సాధించడం ఎలా అని ఆలోచిస్తారు. రోజంతా ఇలానే చేస్తారు... ఆపై నిద్రపోతారు. మరుసటి రోజు కూడా చక్రం పునరావృతమవుతుంది. నేను అధికార కేంద్రంలో పుట్టాను. కానీ నిజంగా దానిపై ఆసక్తి లేదు. దానికి బదులుగా నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. నేను దేశాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను” అని ఆయన అన్నారు.
కుల వ్యవస్థ చేస్తున్నఅబద్దపు ప్రచారాలకు వ్యతిరేకంగా దళితులు చేస్తున్న పోరాటాలను ప్రతిబింబించే విధంగా రూపొందించిన ‘‘ దళిత్ ట్రూత్ : అంబేద్కర్ దార్శనికత కోసం పోరాటాలు’’ అనే పుస్తకాన్ని రాహుల్ గాంధీ అవిష్కరించారు. ఇది పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా (PRHI) నుంచి వెలువడిన ‘రీథింకింగ్ ఇండియా’ సిరీస్‌లో ఎనిమిదో వ్యాల్యూమ్.
ఈ ఆవిష్కణ అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి రాకముందు నుండే దళితుల పట్ల ఎలా వ్యవహరిస్తారనే అంశం తనకు ఆసక్తిగా ఉందని అన్నారు. “నేను లండన్‌లో ఉన్నప్పుడు నా దేశంలో మరికొందరిని తాకడానికి నిరాకరించే కొంతమంది వ్యక్తులు ఎలా ఉండగలరు అనే ఆలోచన నా మదిలో వచ్చింది. ఒక వ్యక్తి కుక్కను కొట్టగలిగినప్పుడు, ఒక క్రిమిని చంపగలిగినప్పుడు, కానీ ఒక వ్యక్తిని తాకడానికి ఎలా నిరాకరిస్తాడు ’’ అని అన్నారు.
ఈ పుస్తకం మాజీ IAS అధికారి కె రాజు సంపాదకత్వం వహించిన వ్యాసాల సమాహారం. ఇందులో దళితులకు ఎదురయ్యే సామాజిక, విద్యా, ఆర్థిక, సాంస్కృతిక సవాళ్లు, అవకాశాలు, వారి సమీకరణ కోసం రాజకీయ పార్టీల వైవిధ్యమైన వ్యూహాలు, సమానత్వాన్ని సాధించడానికి దళితులు చేయవలసిన ఎంపికల గురించి లోతైన వివరాలను అందజేస్తుంది.
