దేశంలో కరోనా నేపథ్యంలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూలు, లాక్‌డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్ధితులు చూస్తుంటే.. మళ్లీ దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వలస కూలీలు తిరిగి స్వస్థలాల బాట పట్టారు.

గత కొన్నిరోజులుగా రైళ్లు, బస్సులు వలస కూలీలతో కిటకిటలాడుతున్నాయి. దీంతో నిరుపేదలపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 2021 మే, జూన్ నెలలకు గాను పీఎం గరీబ్ కళ్యాణ్ అన్ యోజన కింద ఉచిత ఆహారా ధాన్యాలు అందిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.

దీని ప్రకారం మే, జూన్ నెలల్లో 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు పేదలకు అందించబడతాయి. దేశ వ్యాప్తంగా సుమారు 80 కోట్ల మంది దీని వల్ల లబ్ధి పొందుతారని కేంద్రం ప్రకటించింది.

Also Read:పేరుకు సీఎంని.. ఏం చేయలేకపోతున్నా: ప్రధానితో గోడు వెల్లబోసుకున్న కేజ్రీవాల్

లాక్‌డౌన్ వల్ల నిరుపేదలు ఆకలితో అలమటించకూడదన్న ఆశయంతో ప్రధాని మోడీ గతేడాది ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పేదలు పోషకాహారం తీసుకోవాలని ప్రధాని తెలిపారు. పీఎం గరీబ్ అన్ యోజన పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.26 వేల కోట్లను ఖర్చు చేయనుంది. 

కాగా, దేశంలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించారు.

ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్‌ సీఎంలు అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉద్ధవ్‌ ఠాక్రే, పినరయి విజయన్‌, అశోక్‌ గెహ్లోత్‌, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. ఆక్సిజన్‌ కొరతపై మోదీ ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.