Asianet News TeluguAsianet News Telugu

అంత‌ర్జాతీయ క్రీడ‌ల్లో ప‌థ‌కాలు సాధించిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు..

Bengaluru: అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అంశానికి కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. బ్యాచిలర్స్ డిగ్రీ కంటే తక్కువ ఉత్తీర్ణులైన వారికి గ్రూప్-సీ లేదా గ్రూప్-డీ పోస్టు ఇస్తామ‌ని కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జేసీ.మధుస్వామి తెలిపారు.
 

Government jobs for those who have won medals in international sports: Karnataka cabinet
Author
First Published Dec 9, 2022, 12:15 AM IST

Karnataka Govt Jobs: అంతర్జాతీయ టోర్నీల్లో పతకం సాధించిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగాలు వారి విద్యార్హతను బట్టి క్లాస్-ఏ నుండి క్లాస్-డీ వ‌ర‌కు ఉండ‌నున్నాయి. “అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహించడానికి, ప్రభుత్వ ఉద్యోగాల్లోకి ఆయా క్రీడాకారుల‌ను తీసుకోవ‌డానికి క‌ర్నాట‌క ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అంత‌ర్జాతీయ క్రీడ‌ల్లో ప‌త‌కాలు సాధించిన వారికి  గ్రూప్-ఏ నుండి గ్రూప్-సీ, గ్రూప్-డీ వరకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు”అని కర్ణాటక లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జేసీ.మధుస్వామి క్యాబినెట్ సమావేశం ముగిసిన తరువాత విలేకరులతో అన్నారు.

ఒలంపిక్స్ లేదా పారాలింపిక్స్, కామన్ వెల్త్ గేమ్స్‌లో ప‌త‌కాలు సాధించి.. బ్యాచిలర్స్ డిగ్రీ చదివిన వారికి గ్రూప్-ఏ విభాగంలో ఉద్యోగం లభిస్తుందనీ, ఆసియాలో స్థాయిలో ప‌థ‌కాలు సాధించిన వారికి  బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి గ్రూప్-బీ పోస్టు లభిస్తుందని ఆయన చెప్పారు. బ్యాచిలర్స్ డిగ్రీ కంటే తక్కువ విద్యార్హ‌త క‌లిగిన వారికి గ్రూప్-సీ, గ్రూప్-డీ పోస్టులలో ఏదైనా పొందుతారని మధుస్వామి తెలిపారు. ''మేం విద్యార్హత విషయంలో రాజీపడటం లేదు. 10 ఏళ్ల వయోపరిమితిలో సడలింపు ఇస్తున్నాం’’ అని మంత్రి వివరించారు. గ్రూప్-ఏ ఉద్యోగం పొందిన క్రీడాకారులకు అసిస్టెంట్ కమిషనర్ పోస్టు, గ్రూప్-బీ పోస్టు తహశీల్దార్‌తో సమానంగా ఉంటుందని ఆయన తెలిపారు.

కాగా, యత్తినహోళే తాగునీటి పథకం సవరించిన అంచనా వ్యయం రూ.23,251.66 కోట్లకు మంత్రివర్గం పరిపాలనాపరమైన ఆమోదం తెలిపిందనీ, పథకం ప్రారంభించినప్పుడు దాని అంచనా వ్యయం రూ.12,000 కోట్లు అని మధుస్వామి తెలిపారు. కాలం గడిచే కొద్దీ ఇప్పుడు రూ.23,251.66 కోట్లకు పెరిగిందని తెలిపారు. "భూసేకరణ, నిర్మాణ సామగ్రి ధర పెరుగుదల కారణంగా ఖర్చు పెరిగింది" అని మంత్రి చెప్పారు. రూ.354.5 కోట్ల విలువైన 'అమృత్ స్వాభిమాని కురి (గొర్రెలు) యోజన' కింద రాష్ట్రవ్యాప్తంగా 20,000 మంది గొర్రెల కాపరులకు 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింద‌ని తెలిపారు. బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) కోసం 921 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడానికి పరిపాలనా ఆమోదం కూడా ఈరోజు మంజూరు చేయబడింద‌న్నారు. ఇది కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (CESL) నుండి FAME 2 పథకం కింద కేంద్ర ఆర్థిక సహాయంతో ముందుకు సాగుతుంద‌ని తెలిపారు. 

ఒక్కో బస్సుకు కేంద్రం రూ.39.08 లక్షలు ఇస్తుందని తెలిపారు. వ్యయ వ్యత్యాసాన్ని తీర్చేందుకు రూ. 100 కోట్లను రిజర్వ్ చేసేందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. 2022-23 సంవత్సరానికి రూ. 3,000 కోట్ల వరకు రుణం పొందేందుకు బ్యాంకులు లేదా ఏదైనా ఆర్థిక సంస్థ నుంచి రుణం పొందేందుకు కర్ణాటక ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందని మధుస్వామి తెలిపారు. అలాగే, విద్యుత్ సరఫరా సంస్థల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి, వారి నష్టాలను తగ్గించడానికి 8,064 కోట్ల రూపాయల గ్రాంట్ మరియు సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. “మేము 2002 నుండి ఇప్పటి వరకు వారికి (ఎస్కామ్‌లకు) తగిన నిధులు అందించలేకపోయాము. దీంతో వారి బకాయిలు పెరిగాయి. కాబట్టి, మేము దానిని తగ్గించాలని నిర్ణయించుకున్నాము. మార్చి 31, 2022 నాటికి రూ. 15,219 కోట్ల బకాయిలు ఉన్నాయి. తదుపరి నిధుల సమీకరణ కోసం ఎస్కామ్‌లను ప్రారంభించడానికి, మేము రుణాలు తీసుకోవడానికి ప్రభుత్వ హామీని ఇస్తున్నాము” అని ఆయన చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios