పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
న్యూఢిల్లీ: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌ఎంఓపీఎస్) నాయకుడు విజయ్ కుమార్ బంధు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) ఆమోదించినట్లయితే.. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉండదని తమ బృందం విశ్వసించడంతో నిరసనకు దిగినట్టుగా చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఓపీఎస్‌ను పునరుద్ధరించకపోతే.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ ఫర్ ఓపీఎస్ పేరుతో ప్రచారాన్ని నిర్వహిస్తామని ఎన్‌ఎంఓపీఎస్ ఒక ప్రకటన తెలిపారు. ఇక, కాంగ్రెస్ నేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా, రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్, బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ శ్యామ్ సింగ్ యాదవ్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు కూడా నిరసనలో పాల్గొన్నారు.
మరోవైపు ఢిల్లీలో నిరసన చేపట్టిన ప్రభుత్వ ఉద్యోగులకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. ‘‘ఓపీఎస్‌ను తిరిగి తీసుకురావాలనే ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్‌కు మేము మద్దతు ఇస్తున్నాము. ఎన్‌పీఎస్‌తో ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది. మేము పంజాబ్‌లో ఓపీఎస్‌ను అమలు చేసాము. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఓపీఎస్‌ను అమలు చేయాలని కేంద్రానికి లేఖ రాశాము. మరికొన్ని బీజేపీయేతర ప్రభుత్వాలు కూడా ఓపీఎస్‌ను అమలు చేశాయి’’ అని కేజ్రీవాల్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టుచేశారు.
కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల నిరసనకు మద్దతు తెలిపింది. దేశానికి సేవ చేసే ఉద్యోగులను గౌరవించేలా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని పార్టీ డిమాండ్ చేసింది. ‘‘పాత పెన్షన్ ఉద్యోగుల హక్కు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్‌ను పునరుద్ధరించాయి. ఇందుకు సంబంధించి మా విధానం స్పష్టంగా ఉంది. ఉద్యోగులు తప్పనిసరిగా వారి హక్కులను పొందాలి’’ అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
