సోలోగమి మ్యారేజ్ చేసుకుంటానని ప్రకటించి సంచలనానికి తెరలేపిన గుజరాత్ లోని వడోదరాకు చెందిన క్షమాబిందుకు.. పెద్ద ఆటంకం ఎదురయ్యింది.
గుజరాత్ : ఇటీవలి కాలంలో బాగా ట్రెండ్ లోకి వచ్చి ట్రోల్స్, మీమ్స్, కార్టూన్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేసిన వార్త ‘తనను తను పెళ్లి చేసుకునే అమ్మాయి’.. గుజరాత్ కు చెందిన ఓ యువతి Sologamy Marriage అనే వివాహాన్ని ప్రకటించగానే... ఆశ్చర్యం, ఆసక్తి, ఉత్సుకత, అనుమానం, అపనమ్మకం... ఇలా అనేక రకాల భావోద్వేగాలు ఇంటర్నెట్ ను షేక్ చేశాయి. దీనిమీద రకరకాల మీమ్స్, కార్టూన్లు వరదలై పారాయి. ఆమె తనను తాను పెళ్లి చేసుకోవడమే వింత అంటే.. ఆ పెళ్లి తరువాత తనతో తానే హానీమూన్ ప్లాన్ చేసుకోవడమూ.. నెటిజన్లకు మింగుడు పడలేదు. దీంతో అంతా జూన్ 11న జరగబోయే ఈ పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే, ఇక్కడే ఓ ట్విస్ట్ ఎదురయ్యింది సదరు పెళ్లి కూతురు క్షమాబిందుకు. తనను తాను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచిన గుజరాత్లోని వడోదరకు చెందిన క్మా బిందుకు ఆదిలోనే ఆటంకం ఎదురయింది. ఈ నెల 11న జరగాల్సిన వింత పెళ్లి కీలక మలుపు తిరిగింది. వడోదర శివారులోని గోత్రి ఆలయంలో వివాహం చేసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. అయితే, ఆలయ పాలకమండలి అందుకు నిరాకరించింది. సమాజంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఈ నిర్ణయం గురించి తెలుసుకున్న క్షమా బిందు ఆ ఆలయంలో పెళ్లి చేసుకోబోనని తేల్చి చెప్పింది. అయితే, బిందు గుడిలో కాకుండా బయట పెళ్లి చేసుకుంటుందా? లేదా? అన్ని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, జూన్ 2న గుజరాత్లోని వడోదర చెందిన ఇరవై నాలుగేళ్ల క్షమా బిందు అనే యువతి స్వీయ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సాధారణ వివాహం మాదిరిగానే ఈ వివాహం కూడా సాంప్రదాయబద్దంగానే జరుపుకోనుంది. జూన్ 11న జరిగే ఈ పెళ్లిలో వరుడు తప్ప అన్ని సంప్రదాయ ఆచారాలు ఉంటాయట. ఇటువంటి పెళ్ళి జరగడం దేశంలోనే మొదటి సారి. ఇప్పుడు ఈ పెళ్లి విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
దీనిపై క్షమా బిందు మాట్లాడుతూ.. ‘తను ఎవర్నో పెళ్లి చేసుకుని.. వారికి నచ్చినట్లు ఉండటం తనకు ఇష్టం లేదని.. అయితే, అదే సమయంలో తనకు మాత్రం వధువుల తయారు కావాలని ఉందని.. అందుకే ఇలా నన్ను నేనే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇంతకుముందు దేశంలో ఎవరైనా ఇలా చేశారా? అని ఆన్లైన్ లో వెతికితే వివరాలు రాలేదని బహుశా తానే మొదటి వ్యక్తి కావచ్చని కూడా చెప్పుకొచ్చింది.
‘స్వీయ వివాహం అనేది మన కోసం మనం ఉండాలనే నిబద్ధత.. మన మీద మనకు హద్దులు లేని ప్రేమ… ఇది కూడా స్వీయ అంగీకార చర్య… కొందరు ఎవరినైనా ప్రేమిస్తే వారిని పెళ్లి చేసుకుంటారు. కానీ నన్ను నేను ప్రేమిస్తున్నాను. అందుకే స్వీయ వివాహం’ అని వివరించారు క్షమా బిందు.
అయితే ఇటువంటి వివాహమనేది అసందర్భమైనదని అంటారు, కానీ, సమాజానికి స్త్రీలు ముఖ్యమని తెలియజేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు నా తల్లిదండ్రులు విశాలమైన భావాలు కలిగిన వారిని తన పెళ్ళికి వారి దీవెనలు ఉన్నాయని అన్నారు. క్షమాబిందు గోత్రిలోని ఆలయంలో పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్ కోసం గోవా వెళ్లాలన్నది ఆమె నిర్ణయం.
