పెను ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. రాకపోకలకు అంతరాయం
మహారాష్ట్రలో గూడ్స్ రైలు బోల్తా పడింది. పాన్వెల్ నుంచి వసాయ్‌కి వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి.

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో శనివారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన పాన్వెల్ నుంచి వసాయ్‌కి వెళ్తుండగా జరిగింది. సెంట్రల్ రైల్వేను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని సెంట్రల్ రైల్వే తెలిపింది. రాయ్‌గఢ్ జిల్లాలోని పన్వెల్ నుంచి పాల్ఘర్ జిల్లాలోని బసాయి వైపు గూడ్స్ రైలు వెళ్తోందని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ (CPRO) శివరాజ్ మనస్పురే తెలిపారు.
శనివారం మధ్యాహ్నం 3.05 గంటలకు పన్వెల్-కలోంబోలి సెక్షన్‌లో గూడ్స్ రైలు బ్రేక్ వ్యాన్‌తో సహా నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయని ఆయన చెప్పారు. దీంతో కళ్యాణ్, కుర్లా రైల్వే స్టేషన్‌ల నుంచి ఘటనా ప్రాంతానికి యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లను పంపించారు. గూడ్స్ రైలు బోల్తా పడటంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదం తర్వాత పన్వేల్-వసాయి మార్గంలో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించే పనులను త్వరలో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
రైళ్ల నిలిపివేత
ఈ సంఘటన తర్వాత.. కొంకణ్-ముంబై మార్గంలో చాలా చోట్ల ఐదు ప్యాసింజర్ రైళ్లను నిలిపివేసినట్లు శివరాజ్ మనస్పురే తెలిపారు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కింద రెండు కొత్త లైన్లను వేయడానికి హార్బర్, ట్రాన్స్-హార్బర్ కారిడార్‌లోని పన్వెల్, బేలాపూర్ స్టేషన్ల మధ్య శనివారం రాత్రి నుండి 38 గంటల మెగా బ్లాక్‌ను రైలవే అధికారులు ప్లాన్ చేసినట్లు ఆయన చెప్పారు.