ఢిల్లీ:  
రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వేస్ శుభవార్త ఇచ్చింది. ఏసీ బోగీల టికెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏసీ బోగీల్లో ప్రయాణించాలంటే టికెట్‌ ధర ఎక్కువగా ఉండటంతో సామాన్యులు ప్రయాణం చేసేందుకు దూరంగా ఉంటారు. దీంతో సామాన్యులు కూడా ఇకపై ఏసీ బోగీలలో ప్రయాణించేందుకు వీలుగా ఏసీ బోగీల టికెట్‌ ధరలను తగ్గించింది. 

సౌత్‌ వెస్ట్‌ జోన్‌లోని ఐదు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సర్వీస్‌ల్లోని ఏసీ బోగీలకు టికెట్‌ ధరను తగ్గిస్తున్నట్లు భారతీయ రైల్వేస్ ప్రకటించింది. కర్ణాటకలోని బెంగళూరు, గదగ్‌, మైసూర్‌ ప్రాంతాల నుంచి ఈ ఐదు రైళ్ల సర్వీసులు రాకపోకలు జరుగుతున్నాయి. గదగ్‌-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏసీ కోచ్‌ త్రీటయర్‌ స్లీపర్‌ ప్రయాణ ఛార్జీ 495 రూపాయలు ఉండగా దాన్ని 435కి తగ్గించింది. ఈ తగ్గింపు ధర నవంబరు 11 నుంచి అమల్లోకి రానుంది. 

మైసూర్‌-షిరిడి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏసీ బోగీ టికెట్‌ ధర ప్రస్తుతం 495 రూపాయలు ఉండగా.. దాన్ని260 రూపాయలకి తగ్గించింది. ఈ ధరలు డిసెంబరు 3 నుంచి అమల్లోకి వస్తోంది. ఇక యశ్వంత్‌పూర్‌-బికనీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏసీభోగి టెక్కెట్ ధర 735రూపాయలు ఉండగా దాన్ని 590కి తగ్గించారు.  నవంబరు 30 నుంచి ఈ ధరలు వర్తించనున్నాయి. 

యశ్వంత్‌పూర్‌- సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు టికెట్‌ ధర 345 రూపాయలుండగా...దాన్ని305కి తగ్గించారు. యశ్వంత్‌పూర్‌-హుబ్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ ఏసీ కోచ్‌ టికెట్‌ ధర 735 నుంచి 590కి తగ్గించారు. నవంబరు 22 నుంచి ఈ తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయి.