Bangalore: క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి బీఎస్ య‌డియూర‌ప్ప క్రియాశీల రాజ‌కీయాల‌కు గుడ్ బై  చెప్పారు. అయితే, త‌న చివ‌రి శ్వాస వ‌ర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) తోనే ఉంటాన‌నీ, మ‌రోసారి రాష్ట్రంలో త‌మ పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్య‌మని ప్ర‌క‌టించారు. ఇది త‌ప్ప‌గ జ‌రిగి తీరుతుంద‌ని గెలుపుపై ధీమా వ్య‌క్తంచేశారు. 

BS Yediyurappa Retirement: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ య‌డియూర‌ప్ప క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అయితే, త‌న చివ‌రి శ్వాస వ‌ర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) తోనే ఉంటాన‌నీ, మ‌రోసారి రాష్ట్రంలో త‌మ పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్య‌మని ప్ర‌క‌టించారు. ఇది త‌ప్ప‌గ జ‌రిగి తీరుతుంద‌ని గెలుపుపై ధీమా వ్య‌క్తంచేశారు. 

వివ‌రాల్లోకెళ్తే.. క్రియాశీల రాజ‌కీయాల‌ను నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని య‌డియూర‌ప్ప ప్ర‌క‌టించారు. శుక్రవారం (ఫిబ్రవరి 24) అసెంబ్లీలో ఆయన చివరి ప్రసంగం చేశారు. క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాన‌నీ పేర్కొన్నారు. అయితే, బీజేపీ గెలుపు కోసం తన చివరి శ్వాస వరకు కృషి చేస్తానని చెప్పారు. బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే తన ఏకైక లక్ష్యమనీ, అది జరుగుతుందని తాను నమ్ముతున్నానని చెప్పారు.

ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనని తాను ఇప్పటికే ప్రకటించాననీ, అయితే తన చివరి శ్వాస వరకు పార్టీ విజయం కోసం క్రియాశీలకంగా పనిచేస్తానని య‌డియూర‌ప్ప బుధవారం చెప్పారు. రాష్ట్ర బ‌డ్జెట్ స‌మావేశాల చివ‌రి సెష‌న్ రోజున ఆయ‌న ప్ర‌సంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ స‌మ‌యంలో ఏమి చెప్పాలో, ఏమి చెప్పకూడదో త‌న‌కు తెలియ‌డంలేద‌ని పేర్కొన్నారు. త‌న‌ను ఇంతటి స్థాయికి తీసుకువచ్చిన షికారిపూర్ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాన‌ని చెప్పారు. తన మిగ‌తా జీవితపు చివరి శ్వాస వరకు షికారిపూర్ ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేస్తానని మాట్లాడినప్పుడు ఆయన గొంతులో వణుకు, ఉద్వేగం నెలకొంది. ఈ సమయంలో యడ్యూరప్ప మాటలు విని సభ అంతా నిశబ్దంగా మారిపోయింది.

దేవెగౌడ‌, సిద్ద‌రామ‌య్య‌లపై ప్ర‌శంస‌లు..

ఇదే నా చివరి సభ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన బీఎస్ యడియూర‌ప్ప.. తాను రాజకీయంగా ఎదిగిన తీరు, ప్రభుత్వ విజయాలు, కొత్త, కొత్త కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఈ స‌మ‌యంలో త‌న రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ, అలాగే, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు సిద్ధరామయ్యపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ కొనియాడారు. దేవెగౌడ అండ మ‌నంద‌రికీ కావాల‌నీ, ఈ వయసులో కూడా మన రాష్ట్ర నేల, నీరు, భాష గురించి ఆలోచిస్తార‌ని అన్నారు. అలాగే, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్యతో కూడా విజయవంతంగా తాను పనిచేశాన‌ని తెలిపారు.

'నాలుగు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాను'

బీజేపీ తనను పక్కన పెట్టిందని ప్రతిపక్షాలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించాయనీ, అయితే తాను నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని స్పష్టం చేశారు. మరే నాయకుడికీ ఇన్ని అవకాశాలు ఇవ్వలేద‌నీ, ప్రధాని నరేంద్ర మోడీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయ‌న చెప్పారు.

ప్రసంగానికి ప్రధాని ప్రశంసలు

యడ్యూరప్ప వీడ్కోలు ప్రసంగం పార్టీ నైతికతను ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. 'బీజేపీ కార్యకర్తగా ఈ ప్రసంగం నాకు చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది. ఇది మా పార్టీ నైతికతకు నిదర్శనం. ఇది కచ్చితంగా ఇతర పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. కాగా య‌డియూర‌ప్ప 1988లో కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1983లో తొలిసారి కర్ణాటక శాసనసభ దిగువ సభకు ఎన్నికైన ఆయన అప్పటి నుంచి ఆరుసార్లు షికారికూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.