బంగారాన్ని మందు బిళ్లల రూపంలో మింగి.. అక్రమరవాణా చేస్తున్న ఎనిమిదిమందిని చెన్నై విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. వీరి కడుపులోనుంచి 4.15 కిలోల బంగారాన్ని బైటికి తీశారు. వీటి విలువ రూ. 2.17 కోట్లు ఉంటుందని అంచనా. 

జనవరి 30న దుబాయ్ నుంచి చెన్నైకి చేరుకున్న వందేభారత్‌ ఎయిర్‌ ఇండియా విమానంలో వీరు వచ్చారు. ఈ ప్రయాణికుల్లో ఎనిమిది మందిపై అనుమానం రావడంతో తనిఖీలు చేశారు. కానీ వారి దగ్గర ఏమీ దొరకలేదు. అయినా ఇంకా అనుమానం వీడక విమానాశ్రయంలోని ఆస్పత్రితో ఎక్స్ రే తీయించారు. దీంట్లో బంగారు ఉండలు మందు గోళీల రూపంలో కనబడ్డాయి. 

కస్టమ్స్ అధికారులు తమదైన శైలిలో ప్రశ్నించగా మంచినీళ్లు తాగుతూ బంగారు మాత్రల్ని మింగినట్టు అంగీకరించారు. వెంటనే వీరిని చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి బంగారు మాత్రలను బయటకు తీశారు.

వారి కడుపులోనుంచి తీసిన రూ. 2.17 కోట్లు విలువైన  4.15 కిలోల బరువున్న 161 మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. నిందుతులైన కనకవల్లి, నిషాంతి, కళా, ఫాతిమా, పుదుకోటైకి చెందిన జయరాజ్, జగదీష్, కబర్‌ఖాన్, రామనాథపురానికి చెందిన హకీంలను చెన్నై విమానాశ్రయానికి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు.