కేంద్ర ప్రభుత్వం బంగారంపై సంచలన నిర్ణయం తీసుకుంది. మన దేశంలో పసిడి ప్రియులు కాస్త ఎక్కువగానే ఉంటారు. బంగారాన్ని కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా... అదో ఆస్తిగా భావిస్తుంటారు. బంగారంపై పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య కూడా తక్కువేమి కాదు. అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో పసిడిని విరవిగా కొంటూ ఉంటారు.

అయితే... కొందరు  నల్ల డబ్బు ని బంగారం రూపంలో మార్చుకుంటున్నారు. వారి ఆటలు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటోంది. సరికొత్తగా క్షమాభిక్ష పథకాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.నోట్ల రద్దు తర్వాత కేంద్రం తీసుకున్న అతి పెద్ద నిర్ణయం ఇదే అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ పథకం ప్రకారం... నిర్ణీత పరిమాణానికి మించి బంగారం ఉంటే తెలియజేసేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం నల్లదనాన్ని బంగారం రూపంలో దాచుకునేవారిని కట్టడి చేసేందుకే  ప్రభుత్వం ఈ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆదాయపన్ను ఆమ్నెస్టీ తరహాలో బంగారం కోసం ప్రత్యేక పన్నుమాఫీ పథకాన్ని తీసుకురానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఈ పథకం ప్రకారం వ్యక్తుల వద్ద నిర్ణీత పరిమితికి మించి బంగారం ఉంటే... దానిపై పన్నుు చెల్లించే అవకాశం కల్పిస్తారని సదరు వర్గాలు చెబుతున్నాయి. అయితే... ఆ పన్ను రేటు ఎంత ఉంటుంది అన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఈ పథకం ప్రకారం... పరిమితికి మించిన బంగారం లభిస్తే. భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.

పెళ్లైన మహిళల వద్ద ఉన్న బంగారానికి ఇప్పటికే ఉన్న పరిమితికి మించి మరికొంత మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రెవెన్యూ శాఖ సంయుక్తంగా ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వ శఆఖ తమ ప్రతిపాదనను కేంద్ర కేబినేట్ ముందుకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

ఈ పథకాన్ని అక్టోబర్ నెలలోనే తీసుకురావాలని భావించగా... మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల నేపథ్యంలో ఈ నెలకు వాయిదా వేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీనిపై కేంద్రం అధికారిక ప్రకటన వస్తే.. పూర్తి విషయాలు తెలుస్తాయి.