తాను కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకున్న విచిత్ర సంఘటన ముంబైలో జరిగింది. వివరాల్లోకి వెడితే.. 

తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన ఎస్‌ నవీన్‌ (33) అనే వ్యక్తికి ముంబైలోని ఓ నేషనల్ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగం వచ్చింది. ఎన్నో ప్రయత్నాల తరువాత మంచి ఉద్యోగం రావడంతో కుటుంబ సభ్యులు, స్నేహతులు సంతోషంలో మునిగితేలారు. 

అయితే అనుకోకుండా ఉద్యోగంలో చేరిన 15 రోజుల్లోనే నవీన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబై నుంచి త్రివేండ్రం వెళ్తున్న రైలు కింద పడి గత శనివారం ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం కుటుంబ సభ్యులు, గ్రామస్తుల్లో విషాదం నింపింది.

అయితే నవీన్‌ ఆత్మహత్యపై విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్‌ విషయం తెలిసింది. నవీన్ జేబులో స్వాధీనం చేసుకున్న సూసైడ్‌ లెటర్‌ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే తన ప్రాణాలు అర్పిస్తానని దేవుడికి మొక్కినట్లు దానిలో రాసిఉంది. 

‘ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నా. ఎన్నో ప్రార్థనలు చేశా. జాబ్‌ వస్తే తన ప్రాణలు అర్పిస్తా అని మొక్కినా. చివరికి ప్రార్థనలు ఫలించి బ్యాంక్‌ మేజేజర్‌ పోస్టు వచ్చింది. 15 రోజులు ఉద్యోగం చేశా. దేవుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆత్మహత్య చేసుకుంటున్నా. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అంటూ నోట్‌లో రాసి ఉంది.

అయితే నవీన్ సూసైడ్‌ లెటర్‌ మీద పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది నవీనే రాశాడా? నవీన్ ని చంపి లెటర్ పెట్టారా? దీని వెనుక ఎవరి కుట్రైనా ఉందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగం వస్తే ఆత్మహత్య చేసుకోవడం ఏంటనీ మరింత లోతుగా విచారిస్తున్నారు. మృతదేహాన్ని కన్యాకుమారిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.