రామ మందిరం తెరుచుకున్న తర్వాత గోద్రా తరహా అల్లర్లు జరగొచ్చు - ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయి, తెరుచుకున్న తరువాత గోద్రా లాంటి అలర్లు చోటు చేసుకునే అవకాశం ఉందని శివసేన (యూబీటీ) నేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే అన్నారు. శివసేన ఎప్పటికీ హిందుత్వాన్ని వదులుకోబోదని తెలిపారు.

అయోధ్యలో 2024లో రామమందిర నిర్మాణం పూర్తయిన తర్వాత మరో గోద్రా తరహా అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని జల్గావ్లో శివసేన కార్యకర్తల సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత గోద్రా లాంటి అల్లర్లతో రాజకీయ లబ్ధి పొందుతారని పరోక్షంగా ఆయన బీజేపీని ఉద్దేశించి అన్నారు.
‘‘రామ మందిర ప్రారంభోత్సవానికి బస్సులు, ట్రక్కుల్లో ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రజలను ఆహ్వానించే అవకాశం ఉంది. వారు తిరుగు ప్రయాణంలో గోద్రాలో జరిగిన ఘటనను పోలిన సంఘటన జరగవచ్చు. 2024 లోక్ సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు అంటే 2024 జనవరిలో రామ మందిరాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.’’ అని తెలిపారు.
బాలాసాహెబ్ ఠాక్రే హిందుత్వ వారసత్వంపై భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఆయన నాయకత్వంలో శివసేన ఎప్పటికీ హిందుత్వాన్ని వదులుకోదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేపై విమర్శలు గుప్పించిన ఠాక్రే.. రాష్ట్రంలో బీజేపీతో చేతులు కలిపేందుకు కొన్ని కప్పలు అవతలి వైపుకు దూకాయని తీవ్ర విమర్శలు చేశారు.
భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లకు ప్రజలు ఆరాధించే సొంత ప్రతినిధులు లేరని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. అందుకే వారు సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి దిగ్గజాలను తమ ప్రతినిధులుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. అలాగే ఇప్పుడు కూడా వారు (బీజేపీ-ఆరెస్సెస్) తన తండ్రి బాల్ థాకరే వారసత్వం తమదే అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఠాక్రే ఆరోపించారు. బీజేపీ, ఆరెస్సెస్ లకు సొంతంగా విజయాలు లేవని అన్నారు. సర్దార్ పటేల్ విగ్రహం పరిమాణం ముఖ్యం కాదని, ఆయన సాధించిన విజయాలే ముఖ్యమన్నారు. కానీ వీరు (బీజేపీ, ఆరెస్సెస్ కు చెందినవారు) సర్దార్ పటేల్ సాధించిన విజయాలకు కనీసం దగ్గర కూడా లేరని విమర్శించారు.