Asianet News TeluguAsianet News Telugu

అధికారంలోకి వస్తే ప్రతి ఇంట్లో మహిళకు నెలకు రూ. 5 వేలు.. టీఎంసీ ఎన్నికల హామీ..

టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా (Mahua Moitra).. మహిళలకు అదిరిపోయే హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. గృహ లక్ష్మి (Griha Laxmi) పథకం కింద ప్రతి ఇంటిలోని ఒక మహిళకు నెలకు రూ. 5 వేల చొప్పున నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు.  

Goa Polls TMC promises Rs 5000 to a woman of every household per month
Author
Goa, First Published Dec 11, 2021, 5:05 PM IST

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో పలు రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మరోసారి అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ (Mamata Banerjee) సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress).. గోవాలో పాగా వేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అక్కడ పర్యటించారు. గోవాలోని మొత్తం 40 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు బరిలో నిలుస్తారని కూడా చెప్పారు. అయితే తాజాగా గోవాలో టీఎంసీ బాధ్యతలు చూస్తున్న ఆ పార్టీ ఎంపీ మహువా మోయిత్రా (Mahua Moitra).. మహిళలకు అదిరిపోయే హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. గృహ లక్ష్మి (Griha Laxmi) పథకం కింద ప్రతి ఇంట్లోని ఒక మహిళకు నెలకు రూ. 5 వేల చొప్పున నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు.  

ఈ పథకం కోసం పార్టీ త్వరలోనే కార్డుల పంపిణీ ప్రారంభిస్తుందని.. వాటికి యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్లు ఉంటాయని.. గోవాలో టీఎంసీ అధికారంలోకి రాగానే అవి పనికి వస్తాయని చెప్పారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ ఆధార్ పథకం.. పెరుగుతున్న ఖర్చులను భరించేందుకు ఏ మాత్రం సరిపోదని అన్నారు. అందుకే మీ ఆశీస్సులతో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో రాగానే.. గృహ లక్ష్మి పథకం ప్రతి ఇంటికి అవసరమైన నెలవారి ఆదాయం అంజేస్తామని చెప్పారు. మహిళలకు నెలకు రూ. 5 వేలు బదిలీ చేస్తామని తెలిపారు. 

రాష్ట్రంలోని 3.5 లక్షల కుటుంబాలకు చెందిన మహిళలు గృహ లక్ష్మి పథకం కిందకు వస్తారని అన్నారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న గృహ ఆధార్ పథకంలో.. తప్పనిసరి చేయబడిన గరిష్ట ఆదాయ పరిమితిని కూడా తొలగిస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పథకం కింద మహిళలకు నెలకు రూ. 1,500 మాత్రమే అందుతుందని, ఆదాయ పరిమితి కారణంగా 1.5 లక్షల కుటుంబాలకు మాత్రమే ఇది అందుతుందని అన్నారు. 

‘గృహ ఆధార్ పథకం యొక్క వాస్తవ అమలుకు సంవత్సరానికి రూ. 270 కోట్లు అవసరం. కానీ గోవా ప్రభుత్వం సంవత్సరానికి రూ. 140 కోట్లు మాత్రమే కేటాయించింది. దీని కారణంగా చాలా మంది ప్రజలు ప్రయోజనం పొందలేకపోతున్నారు’ అని మహువా మోయిత్రా చెప్పారు. టీఎంసీ అమలు చేయబోయే పథకం కోసం గోవా మొత్తం బడ్జెట్‌లో ఆరు నుంచి ఎనిమిది శాతం వ్యయం ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. COVID-19 దేశ ఆర్థిక వ్యవస్థ‌పై తీవ్ర ప్రభావం చూపిందని తాజా అధ్యయనాలు వెల్లడించాయని.. దానిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని మోయిత్రా అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios