ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో ఖాతా తెరిచింది. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవాపై అరవింద్ కేజ్రీవాల్ మొదటి నుంచి దృష్టి కేంద్రీకరించారు. అయితే అనుకున్నట్టుగా పోటీ ఇవ్వలేకపోయారు. ప్రస్తుతానికి ఒక అభ్యర్థి మాత్రం ఆ పార్టీ నుంచి గెలుపొందారు.
ఢిల్లీలో మూడో సారి అధికారం చేపట్టి మంచి జోరులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సారి జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే ఆ పార్టీ ప్రధానంగా ఢిల్లీ పక్కనే ఉన్న పంజాబ్ పై, గోవాపై ప్రధానంగా దృష్టి సారించింది. పంజాబ్ లో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. అయితే గోవాలోనూ ఖాతా తెరిచింది.
గోవాలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పర్యాటక రాష్ట్రమైన గోవాలో ఈ సారి ఎలాగైనా పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది. దాని కోసం చాలా సార్లు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గోవాలో పర్యటనలు చేశారు. ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించారు. సభల్లో పాల్గొన్నారు. ప్రెస్ మీట్ లు నిర్వహిస్తూ ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నేర చరిత్ర లేని, చదువుకున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చారు. గోవా దివంగత సీఎం మనోహర్ పారీకర్ కుమారుడు ఉత్పల్ పారీకర్ కు పనాజీ నుంచి బీజేపీ టికెట్ నిరాకరించిన వెంటనే ఆరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. తమ పార్టీ తరపున పనాజీ టికెట్ కేటాయిస్తామని తెలిపారు.
గోవాలో కాంగ్రెస్ గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలు పొందినా అధికారం ఏర్పాటు చేయలేకపోయింది. కానీ బీజేపీ పలు పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థులు అంతా బీజేపీలోకి జంప్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ కు కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మిగిలారు. ఈ ఫిరాయింపుల విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అరవింద్ కేజ్రీవాల్ కొత్త వ్యూహాన్ని అనుసరించారు. తమ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు ఎవరూ పార్టీ మారబోరని ప్రజలకు సందేశం వినిపించేందుకు లీగల్ అఫిడవిట్ లపై సంతకాలు పెట్టించారు. తాము విజయం సాధిస్తే పార్టీ మారబోమని, ఎన్నికల హామీలను తప్పకుండా నెరవేరుస్తామని, చిత్తశుద్ధితో పని చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ బాండ్ పేపర్ పై అభ్యర్థులు సంతకాలు పెట్టారు. తమ పార్టీ అభ్యర్థులు చెప్పింది చేయకపోతే లీగల్ గా కేసు ఫైల్ చేయవచ్చనే నమ్మకాన్ని గోవా ఓటర్లకు కల్పించేందుకు కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
గోవాలో బీజేపీ అధికారంలో ఉన్నది. సీఎంగా ప్రమోద్ సావంత్ ఉన్నారు. ఆయన గతంలో పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం నుంచే మరోసారి బరిలోకి దిగారు. కాగా, గోవా మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత మనోహర్ పారికర్ మరణం తర్వాత ఆయన కుమారుడు ఉత్పల్ పారికర్ తండ్రి పోటీ చేసిన పనాజీ నుంచే బరిలోకి దిగారు. పనాజీ నుంచి బీజేపీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో స్వతంత్రంగా పోటీ చేశారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. కాగా ఆప్ మాత్రం అమిత్ పాలేకర్‌ను సీఎం క్యాండిడేట్‌గా ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచే కాకుండా, స్వతంత్రంగా 301 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇక్కడ బీజేపికి కాంగ్రెస్, మహారాష్ట్రవాది గోమంత్ పార్టీ, టీఎంసీ, ఆప్ పార్టీలు తలపడ్డాయి.
