గోవా ఎన్నికల్లో పోటీ నుంచి మాజీ సీఎం, తృణముల్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు లూయిజిన్హో ఫలేరో చివరి నిమిషంలో వైదొలిగారు. ఆయనకు బదులుగా ఆ స్థానంలో న్యాయవాది అయిన ఓ యువతికి అవకాశం కల్పించారు.
Goa Election News 2022 : గోవా ఎన్నికల్లో పోటీ నుంచి మాజీ సీఎం, తృణముల్ కాంగ్రెస్ (tmc) జాతీయ ఉపాధ్యక్షుడు లూయిజిన్హో ఫలేరో (Luizinho Faleiro) వైదొలిగారు. ఆయనకు బదులుగా ఆ స్థానంలో న్యాయవాది అయిన ఓ యువతికి అవకాశం కల్పించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెళ్లడించారు. “నేను ఫటోర్డా నుండి TMC అభ్యర్థిగా ఉపసంహరించుకుంటున్నాను. ఒక ప్రొఫెషనల్ యువతికి లాఠీని అప్పగిస్తున్నాను. మహిళలకు సాధికారత కల్పించడం మా పార్టీ విధానం’’ అని ఆయన పేర్కొన్నారు.
ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ తరపున ప్రచారం చేయాలని భావిస్తున్నానని లూయిజిన్హో ఫలేరో తెలిపారు. పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ సహకారంగా ఉంటానని చెప్పారు. దీంతో వారి పని తీరు మెరుగుపడుతుందని అన్నారు. టీఎంసీ అధినేతను సంప్రదించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. గత ఎన్నికల సమయంలో పోటీ చేసినప్పుడు, తన పార్టీలోని ఇతర అభ్యర్థులకు ఎక్కువగా సమయం కేటాయించలేకపోయానని అన్నారు. ఫటోర్డా (Fatorda) నుంచి పార్టీ అభ్యర్థిగా సియోలా వాస్ (Seoula Vas) ఉంటారని ఆయన చెప్పారు.
అనంతరం టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా (Mahua Moitra) మీడియాతో మాట్లాడారు. ‘‘మేము ఫటోర్డాలో బీజేపీతో పోరాడి విజయం సాధించాలని చూస్తున్నాం. చివరి క్షణంలో అభ్యర్థిని ఎంపిక చేసినా.. ఇది ప్రజలకు అవసరమైన ఎంపిక. ఇది నిజాయితీ గల ఎంపిక’’ అని ఆమె తెలిపారు. రాట యోధురాలు, ఉద్యమకారి అయిన ఓ గొప్ప మహిళను తమ అభ్యర్థిగా ఎంచుకున్నామని చెప్పారు. ఆ అభ్యర్థికి ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేదని అన్నారు. మమతా బెనర్జీ మహిళలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారని ఆమె తెలిపారు.
ఈ మీడియా సమావేశం అయిన కొంత సమయం తరువాత గోవా టీఎంసీ తమ అభ్యర్థిగా సియోలా వాస్ (Seoula Vas) ను పేరును చేరుస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే, గోవా ఫార్వర్డ్ పార్టీ (జిఎఫ్‌పి) చీఫ్ విజయ్ సర్దేశాయ్ (vijay sardheshay) వాస్ పోటీ చేయనున్నారు. అయితే విజయ్ సర్దేశాయ్ కు చెందిన గోవా ఫార్వర్డ్ పార్టీకి టీఎంసీకి రెండు నెలల క్రితం పొత్తు చర్చలు జరిగాయి. ఈ పొత్తు దాదాపుగా ఖరారు అయిపోయింది. అయితే చివరి నిమిషంలో సర్దేశాయ్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విజయ్ సర్దేశాయ్ కు గుణపాఠం చెప్పడానికి టీఎంసీ తన జాతీయ ఉపాధ్యక్షుడు అయిన లూయిజిన్హో ఫలేరో రంగంలోకి దించింది. దీంతో ఆయనకు చెక్ పడనుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ ఆ స్థానంలో లూయిజిన్హో ఫలేరో కు ఆ ప్రాంతంలో పలుకబడి పెద్దగా లేదు. పార్టీ నిర్ణయం పట్ల మొదటి నుంచీ ఆయన ఆందోళనగానే ఉన్నారు. ఓ క్రమంలో పార్టీకి రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు. ఆ వార్తలను ఆయన ఖండించినప్పటికీ.. తన అయిష్టతను TMC జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కి తెలియజేశాడు. దీంతో అధిష్టానం చివరి నిమిషంలో ఆయన స్థానంలో ఓ మహిళా న్యాయవాదిని రంగంలోకి దించారు.
