గోవా కాంగ్రెస్‌లో అంతర్గత పోరు రాజుకుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా లోబోను ఎన్నుకోవడంపై దిగంబర్ కామత్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది. మరో రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో నిర్వహించిన పార్టీ సమావేశానికి కామత్ సహా ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టినట్టు తెలిసింది. ఇందులో కొందరు బీజేపీతో టచ్‌లో ఉన్నారని రాజకీయవర్గాలు వివరించాయి.
పనాజీ: గోవా కాంగ్రెస్‌లో అంతర్గత పోరు రాజుకున్నట్టు తెలుస్తున్నది. గోవా కాంగ్రెస్‌లో నేతల మధ్య విబేధాలు నెలకొన్నట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు రెండు రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ ఓ సమావేశాన్ని నిర్వహించింది. కానీ, ఈ కాంగ్రెస్ భేటీకి ముగ్గురు ఎమ్మెల్యేలు దూరంగానే ఉన్నట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందులోనూ కొందరు బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు ఆ వర్గాలు వివరించాయి.
గోవా అసెంబ్లీలో రెండు వారాలపాటు బడ్జెట్ సమావేశాలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో పార్టీ భేటీకి ముగ్గురు నేతలు గైర్హాజరు కావడం కలకలం రేపుతున్నది. అయితే, ఈ ఆరోపణలను గోవా కాంగ్రెస్ చీఫ్ అమిత్ పాట్కర్ తోసిపుచ్చారు. ఇవన్నీ బీజేపీ వర్గాలు చేస్తున్న దుష్ప్రచారం అని అన్నారు. తమ పార్టీలో ఎలాంటి అంతర్గత పోరు లేదని స్పష్టం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నామినీగా ఉన్న దిగంబర్ కామత్ ఈ సారి పార్టీ వ్యవహరాలపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఈయన పార్టీ సమావేశాలకు హాజరు కాలేదని తెలిసింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మైకేల్ లోబోను ఎన్నుకోవడంపై ఈయన అసంతృప్తిగా ఉన్నారు. అందుకే శనివారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన హాజరు కాలేదని విశ్వసనీయ వర్గాలు వివరించాయి. కాగా, ఈ ఆరోపణలను గోవా కాంగ్రెస్ యూనిట్ కొట్టివేసింది.
గోవా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను స్పీకర్ రమేశ్ తావడ్కర్ రద్దు చేశారు. ఈ ఎన్నిక మంగళవారం నిర్వహించాల్సింది. కానీ, ఈ నోటిఫికేషన్‌ను ఆదివారం రద్దు చేశారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. అందులో 25 మంది బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సభ్యులు.. 11 మంది ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు.
