Goa Congress Crisis: గోవా శాసనసభ ప్రతిపక్ష నేత పదవి నుంచి మైఖేల్ లోబోను కాంగ్రెస్ తొలగించింది. గోవా డెస్క్ ఇన్‌చార్జి దినేష్ గుండూరావు మాట్లాడుతూ.. మైఖేల్ లోబో, మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ బీజేపీ సహకారంతో పార్టీపై కుట్ర పన్నుతున్నారని, వారిపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందని అన్నారు.

Goa Congress Crisis: గోవాలో రాజకీయ గందరగోళం మధ్య కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఆమెనే స్వ‌యంగా రంగంలోకి దిగారు. గోవాలో రాజకీయ పరిణామాలను పర్యవేక్షించేందుకు ఎంపీ ముకుల్ వాస్నిక్‌ను ఆయన గోవాకు పంపారు. ఈ మేరకు కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను పర్యవేక్షించేందుకు గోవాలో పర్యటించాల్సిందిగా ఎంపీ ముకుల్ వాస్నిక్‌ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు.’’ అని కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ నేత మైఖేల్ లోబోపై కాంగ్రెస్ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించింది. ఆయ‌న‌ను గోవా శాసనసభలో ప్రతిపక్ష నేత పదవి నుంచి తొలగించింది. ఈ మేరకు గోవా డెస్క్ ఇన్‌చార్జి దినేష్ గుండూరావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ గోవా యూనిట్ లీడర్ మైఖేల్ లోబో, మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ బీజేపీతో కుమ్మక్కై.. పార్టీపై కుట్ర పన్నుతున్నారని, వారిపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.

 ముకుల్ వాస్నిక్‌ని గోవాకు పంపిన సోనియా

గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్ లోని ప‌లువురు నేత‌లు బీజేపీతో భేటీ అయిన‌ట్టు వార్త‌లు గుప్పుమంటున్నాయి. లోబో, కామత్ మినహా మరో ముగ్గురు పార్టీ ఎమ్మెల్యేలను సంప్రదించలేదని కాంగ్రెస్ గోవా డెస్క్ ఇన్‌చార్జి దినేష్ గుండూరావు తెలిపారు.

వాస్తవానికి.. 40 మంది సభ్యులున్న సభలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరవచ్చనే ఊహాగానాల మధ్య ఈ పరిణామం తెరపైకి వచ్చింది. గోవాలో కాంగ్రెస్‌లో ఫిరాయింపులు జరిగేలా లోపి మైఖేల్ లోబో, మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ బిజెపితో కలిసి కుట్ర పన్నుతున్నారని రావు అన్నారు. ఈ క్ర‌మంలో లోబోను ప్రతిపక్ష నేత పదవి నుంచి తప్పించాలని పార్టీ నిర్ణయించింది.

గోవాలో కాంగ్రెస్ లో 11మంది ఎమ్మెల్యేలు 

లోబో, కామత్ ఇద్దరిపైనా పార్టీ చర్యలు తీసుకుంటుంది. గోవాలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐదుగురు పార్టీ ఎమ్మెల్యేలు - లోబో, కామత్, కేదార్ నాయక్, రాజేష్ ఫల్దేశాయి, డెలియాలా లోబోలను సంప్రదించలేకపోయారని, మరో ఐదుగురు - ఎల్టన్ డికోస్టా, సంకల్ప్ అమోన్కర్, యూరి అలెమావో, కార్లోస్ అల్వారెస్ ఫెరీరా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

ఆరో ఎమ్మెల్యే అలెక్సో సిక్వేరా పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారని, కాంగ్రెస్‌లో ఉన్నారని రావు చెప్పారు. అధికార బీజేపీకి ప్రస్తుతం 20 మంది ఎమ్మెల్యేలు ఉండగా మరో ఐదుగురి మద్దతు ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 11 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

మరోవైపు, కాంగ్రెస్ ఎమ్మెల్యేను కలవడంపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్పందించారు. ముఖ్యమంత్రిగా నన్ను కలవడానికి చాలా మంది వస్తారు. రేపు అసెంబ్లీ, కాబ‌ట్టి.. ప్రజలు నన్ను కలవడానికి వచ్చారు. నేను అసెంబ్లీ పనుల్లో బిజీగా ఉన్నాను. ఇతర పార్టీలకు సంబంధించిన సమస్యలపై నేను ఎందుకు వ్యాఖ్యానిస్తాను? అని ప్ర‌శ్నించారు.