గోవా సీఎం ప్రమోద్ సావంత్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటి అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సారి కూడా గోవాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, తానే సీఎం అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం హంగ్ ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నాయి.
గోవా (Goa) లో అధికార బీజేపీ (bjp), కాంగ్రెస్‌లు (congress) హోరాహోరీగా తలపడతాయని, అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన మరుసటి రోజు ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్ (pramod sawant) ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ (pm narendra modi)ని కలిశారు. మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయిన అనంతరం ప్రమోద్ సావంత్ మీడియాతో మాట్లాడారు. గోవాలో ఎన్నికల పరిస్థితులపై చర్చించేందుకు తాను ప్రధాని మోదీని కలిశానని ఆయన చెప్పారు. తమ రాష్ట్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, పార్టీ తనకు మరోసారి రాష్ట్రాన్ని పాలించే అవకాశం ఇస్తుందని భావిస్తున్నానని సావంత్ తెలిపారు. ‘‘మేము అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. పార్టీకి (గోవా ముఖ్యమంత్రిగా) మరోసారి సేవ చేసే అవకాశం నాకు లభిస్తుందని భావిస్తున్నాను ’’ అని సావంత్ పేర్కొన్నారు.
అయితే గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మళ్లీ 2017 సీన్‌నే రిపీట్ చేసేలా ఉంటాయని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. బీజేపీకి, కాంగ్రెస్ కూటమికి చెరో 16 సీట్లు వస్తాయని ఈ ఎగ్జిట్ పోల్స్ మొత్తంగా తెలిపాయి. తృణమూల్ కాంగ్రెస్ మూడు స్థానాలు గెలిచే అవకాశం ఉన్నదని పేర్కొన్నాయి. ఇండియా న్యూస్, ఇండియ టీవీ సీఎన్ఎక్స్, ఇండియా టుడే, టైమ్స్ నౌ, ఏబీపీ, సీవోటర్ ఈటీజీ రీసెర్చ్ వంటి మొత్తం పది ఎగ్జిట్ పోల్స్ అంచనాల సగటు తీస్తే.. బీజేపీకి 16 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 16 సీట్లు వచ్చే అవకాశం ఉన్నదని పోల్ ఆఫ్ పోల్ రిజల్ట్‌లో వెల్లడైంది.గోవాలో మెజార్టీ మార్క్ 21 సీట్లు. కానీ, ఈ రెండు ప్రధాన పార్టీలూ మెజార్టీ మార్క్‌కు ఆమడ దూరంలో నిలిచిపోయాయి. దీంతో మూడు సీట్లు గెలిచే అవకాశం ఉన్న టీఎంసీ కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉన్నది. స్వతంత్ర అభ్యర్థులు లేదా ఆప్ పార్టీకి కూడా ప్రాధాన్యం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
2017లో గోవా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఆ పార్టీ మాత్రం అధికారం చేపట్టడంలో విఫలం అయ్యింది. కాగా బీజేపీకి 13 సీట్లు మాత్రమే వచ్చినా అది అవకాశాన్ని అందిపుచ్చుకుంది. అక్కడి గెలిచిన వివిధ పార్టీల ఎమ్మెల్యేలను కలుపుకు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తదనంతర కాలంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన చాలా మంది అభ్యర్థులు బీజేపీకి జంప్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మిగిలారు. అందుకే ఈ సారి ఆ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్ గా ఉన్న చిదంబరం (chidambaram) ఈ విషయంలో మొదటి నుంచీ చాలా గట్టిగా నిలబడ్డారు. కాంగ్రెస్ ను వీడిన నాయకులకు తిరిగి టిక్కెట్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమ్ ఆద్మీ పార్టీ (aam admi party) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) తమ పార్టీ తరఫున నిలబడే అభ్యర్థులతో ముందుగానే బాండ్ పేపర్ పై సంతకం పెట్టుంచుకున్నారు. తాము గెలిచిన తరువాత పార్టీ మారబోమని, మంచి పాలనను అందిస్తామని, హామీలను నెరవేరుస్తామని ఆ బాండ్ పేపర్లలో పేర్కొన్నారు.
