Goa Assembly Election 2022: గోవా ఎన్నికలు.. నేడు కీలక ప్రకటన చేయనున్న కేజ్రీవాల్ !
Goa Assembly Election 2022: అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ద రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గోవాలో ప్రధాన పార్టీలన్ని అధికారం దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు గోవా ఎన్నికల సంబంధించి ఆప్ అధినేత, డిల్లీ సీఎం కేజ్రీవాల్ నేడు కీలక ప్రకటన చేయనున్నారు.
Goa Assembly Election 2022: ఫిబ్రవరిలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు హీటు పెంచాయి. ఈ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. గోవాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో గోవా రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సారి గోవా ఎన్నికల బరిలో నిలువబోతోంది ఆమ్ ఆద్మీ. ఈ క్రమంలోనే ఆప్ ఆధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గోవా ఎన్నికలకు సంబంధించి బుధవారం నాడు కీలక ప్రకటన చేయనున్నారు.
దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఎన్నికల సందడి పూర్తి స్థాయిలో కొనసాగుతుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల 2022కి సంబంధించి బుధవారం కీలక ప్రకటన చేయనున్నారు. కేజ్రీవాల్ జనవరి 19న పనాజీ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారం కొనసాగించనున్నారు. ఈ క్రమంలోనే రాబోయే గోవా ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారని సమాచారం. గోవా అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానున్నాయి.
గోవాలో పోలింగ్ ప్రక్రియకు ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది. గోవాలో ఆప్ బీజేపీ ఓట్లను చీల్చనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ, ఆప్ రెండు పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని పటిష్టంగా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇదివరకు AAP చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం గోవాలో ఇంటింటికీ ప్రచారం చేశారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇతర సభ్యులతో కలిసి గోవాలోని కోర్టాలిమ్ గ్రామ నివాసితులతో సంభాషించారు. ఓటర్లకు ఎన్నికల కరపత్రాలను పంచారు. అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. మేము ఇంటింటికీ ప్రచారం చేసాము. ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే వారికి మార్పు అవసరం. మిగిలిన రెండు పార్టీలతో (కాంగ్రెస్, బీజేపీ) విసిగిపోయారు. ఢిల్లీలో మా పార్టీ అందిస్తున్న మెరుగైన పాలన గురించి అందరికి తెలిసింది అని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో గెలిస్తే గోవాలో తమ చేపట్టబోయే విషయాలను ఆయన కేజ్రీవాల్ ఇదివరకే పలుమార్లు ప్రకటించారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించడంతోపాటు గోవాలోని నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించడంపై పార్టీ దృష్టి సారిస్తుందని ఆప్ అధినేత చెప్పారు. గోవాలో ‘అవినీతి రహిత ప్రభుత్వాన్ని’ ఆప్ నడిపిస్తుందని, ఢిల్లీలో మాదిరిగానే రాష్ట్రంలోనూ మొహల్లా క్లినిక్‌లను ప్రారంభిస్తుందని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే గోవాలోని ప్రతి గ్రామం, ప్రాంతంలో ఆస్పత్రులు ఉంటాయని, మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని కేజ్రీవాల్ అన్నారు. కాగా, గోవా అసెంబ్లీ ఎన్నికలు 2022 ఫిబ్రవరి 14న ప్రారంభం కానుండగా, ఒకే దశలో ఓటింగ్ నిర్వహించబడుతుంది. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాలలో కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు.