Asianet News TeluguAsianet News Telugu

goa assembly election 2022 : గోవా ప్ర‌జ‌ల‌కు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఆశాకిరణం- అర‌వింద్ కేజ్రీవాల్

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరుతో విసుగు చెందిన గోవా ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఆశాకిరణమని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి గోవా ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టో విడుదల చేశారు. 

 

goa assembly election 2022: Aam Aadmi Party is a beacon of hope for Goa people - Arvind Kejriwal
Author
Goa, First Published Jan 16, 2022, 2:05 PM IST

గోవా (goa)ప్రజ‌లకు ఆమ్ ఆద్మీ పార్టీ (aap) ఒక ప్ర‌త్యామ్నాయం అని ఆ పార్టీ జాతీయ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ (arvind kejriwal)  అన్నారు. బీజేపీ (bjp), కాంగ్రెస్ (congress) ల‌తో విసుగు చెందిన స్థానికుల‌కు త‌మ పార్టీ కొత్త ఆశాకిర‌ణంగా క‌నిపిస్తుంద‌ని తెలిపారు. గోవా అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆదివారం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఆమ్ ఆద్మీ పార్టీ త‌ర‌ఫున 13 పాయింట్ల ఎజెండాతో రూపొందించిన మేనిఫెస్టోను ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా అర‌వింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన జ‌రగ‌నున్న ఎన్నికల కోసం గోవా ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇంత‌కు ముందు గోవా వాసుల‌కు బీజేపీ, కాంగ్రెస్ కు ఓటేయ‌డం త‌ప్ప వేరే మార్గం లేదు. వారు మార్పు కోరుకుంటున్నారు. ఈ రెండు పార్టీల తీరుతో ప్ర‌జ‌లు నిరాశ చెందారు అని అన్నారు. 

గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వ‌స్తే.. స్థానిక యువ‌త‌కు ఉపాధి క‌ల్పిస్తామ‌ని తెలిపారు. ఉపాధి పొంద‌ని యువ‌కుల‌కు నెల‌కు రూ. 3 వేలు అందుతుంద‌ని అన్నారు. ప్ర‌స్తుతం మైనింగ్ కు భారీ వ‌డ్డీ ఉంద‌ని అన్నారు. తాము అధికారంలోకి వ‌చ్చిన ఆరు నెల‌ల త‌రువాత భూ హ‌క్కులు కల్పిస్తామ‌ని అన్నారు. మెరుగైన, ఉచిత వైద్యం కోసం గోవాలోని ప్రతి గ్రామం, జిల్లా స్థాయిలో మొహల్లా క్లినిక్‌లు (mohalla clinic), హాస్పిట‌ల్స్ (hospitals) ఏర్పాటు చేస్తామ‌ని అన్నారు. రైతు సంఘాల‌తో చ‌ర్చించిన త‌రువాత వ్యవసాయం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. వాణిజ్య వ్యవస్థను స‌ర‌ళీకృతం చేస్తామ‌ని అన్నారు. 

ఆప్ గోవాలో అధికారం చేప‌డితే రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1000 అందజేస్తామని అర‌వింద్ కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గోవాలో 24 గంట‌ల పాటు ఉచితంగా క‌రెంట్, నీటిని అందిస్తామ‌ని అన్నారు. రోడ్లు మెరుగుప‌రుస్తామ‌ని తెలిపారు. అన్ని గ‌వ‌ర్న‌మెంట్ స్కూళ్ల‌లో (government schools)ఉచిత విద్య అందిస్తామ‌ని తెలిపారు. గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఢిల్లీలో రెండో సారి అధికారం చేప‌ట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ మంచి జోష్ లో ఉంది. తన పార్టీని మిగితా రాష్ట్రాల్లో కూడా విస్త‌రించాల‌ని ఆ పార్టీ జాతీయ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, పంజాబ్, గోవా రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఆప్ పోటీ చేస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగిగా, సామాజిక కార్య‌క‌ర్త‌గా ఉన్న అర‌వింద్ కేజ్రీవాల్ అనూహ్యంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. త‌రువాత వ‌చ్చిన ఢిల్లీలో ఎన్నిక‌ల్లో పాల్గొన్నారు. పోటీ చేసిన మొద‌టి సారే ఢిల్లీలో అధికారం చేప‌ట్టగలిగే స్థానాలు సంపాదించారు. అయితే అధికారం చేప‌ట్టిన కొన్ని నెల‌ల్లోనే రాజీనామా చేసి అంద‌రినీ నిరాశ‌కు గురి చేశారు. మ‌ళ్లీ వ‌చ్చిన ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలుపొందారు. ఐదేళ్ల పాల‌న‌లో ఢిల్లీ ప్ర‌జ‌ల మ‌న‌సు దోచుకున్నారు. ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల‌ను  ప్ర‌వేశ‌పెట్టారు. మ‌ళ్లీ 2020లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆప్ విజ‌య‌ఢంకా మోగించింది.  ఢిల్లీలో ప‌థ‌కాలు మంచి ఫ‌లితాలను ఇవ్వ‌డంతో ఆ స్ట్రాట‌జీనే మిగితా రాష్ట్రాల్లో అమ‌లు చేయాల‌ని అర‌వింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. మ‌రి ఆ ప‌థ‌కాలు ఈ రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఎలాంటి ప్ర‌భావం చూపుతాయో వేచి చూడాల్సి ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios