ఎయిర్‌పోర్టులో ఓ రన్ వే పై హఠాత్తుగా వీధి కుక్క వచ్చింది. దీంతో గో ఫస్ట్ విమానం టేకాఫ్ డిలే అయింది. లేహ్ నుంచి ఢిల్లీకి బయల్దేరాల్సిన గో ఫస్ట్ విమానానికి ఈ సమస్య ఎదురైంది.

న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో విమాన ప్రయాణాల్లో అవాంతరాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. స్పైస్ జెట్ సహా పలు ఎయిర్‌లైన్స్‌లలో ఇటీవలి కాలంలో తరుచూ సాంకేతిక సమస్యలు లేదా ఇతర ఆటంకాలు వచ్చాయి. తాజాగా, గో ఫస్ట్ (ఇంతకు ముందు గో ఎయిర్) విమానాల్లోనూ వరుసగా సమస్యలు ఎదురయ్యాయి. లేహ్ నుంచి ఢిల్లీకు వెళ్లాల్సిన గో ఫస్ట్ విమానం.. రన్ వే పై ఓ వీధి కుక్క కనిపించడంతో ప్రయాణం వాయిదా పడింది. రన్ వే పై ఓ కుక్క రావడంతో లేహ్ - ఢిల్లీ గో ఫస్ట్ విమానం టేకాఫ్ డిలే అయింది. ఈ ఘటన మంగళవారం జరిగింది. రన్ వే పై కుక్క కారణంగా గో ఎయిర్ ఎయిర్ క్రాఫ్ట్ జీ8-226 (లేహ్ - ఢిల్లీ) విమానం టేకాఫ్ డిలే అయినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

ఇదే రోజు గో ఫస్ట్ విమాన యాన సంస్థకు చెందిన రెండు విమానాల ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఈ రెండు విమానాలు డైవర్ట్ చేయడమో లేక అత్యవసర ల్యాండింగ్ చేయడమో జరిగింది.

మంగళవారం ముంబై నుంచి లేహ్, శ్రీనగర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న గో ఫస్ట్ విమానాల ఇంజన్‌లలో సమస్యలు తలెత్తడంతో వాటిని ల్యాండ్ చేసినట్టుగా అధికారులను ఉటంకిస్తూ పీటీఐ వారాసంస్థ రిపోర్ట్ చేసింది. ముంబై నుంచి లేహ్ వెళ్తున్న గో ఫస్ట్ విమానం ఇంజన్ నంబర్ 2లో లోపం గుర్తించడటంతో దానిని ఢిల్లీలో గ్రౌండ్ చేసినట్టుగా డీజీసీఏ అధికారులు తెలిపారు. అలాగే శ్రీనగర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న మరో గో ఫస్ట్ విమానం మిడ్ ఎయిర్‌లో ఉన్న సమయంలో ఇంజిన్ నంబర్ 2లో లోపం తలెత్తడంతో.. తిరిగి శ్రీనగర్‌కు మళ్లించారు. 

ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్టుగా డీజీసీఏ పేర్కొంది. తమ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ఆ రెండు విమానాల టేకాఫ్ అవుతాయని పేర్కొంది.అయితే ఒకే రోజు గో ఫస్ట్ సంస్థకు చెందిన రెండు విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.