భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమ్మాయిల వివాహ కనీస వయస్సు విషయంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

అమ్మాయిలు 15 ఏళ్లకే పునరుత్పత్తిని ప్రారంభించనున్నారు. అయితే వివాహ వయస్సును 18 నుండి 21 ఏళ్లకు ఎందుకు పెంచుతున్నారని మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ విధేయుడు, మాజీ మంత్రి సజ్జన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. సజ్జన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అంతేకాదు పార్టీ నుండి ఆయనను బహిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేసింది.

బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ తేరుకొంది. రాజకీయంగా ఇబ్బంది కలగకుండా నష్టనివారణకు ప్రయత్నాలను ప్రారంభించింది. సమస్య లేకుండానే సమస్యను సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా చెప్పారు.

మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమ్మాన్ పేరుతో ఇటీవల ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలపై చైతన్యపర్చే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సమయంలో అమ్మాయిల పెళ్లి వయస్సును 18 నుండి 21కి పెంచుతున్నట్టుగా ప్రకటించారు.

పురుషుల పెళ్లికి కనీస వయస్సు 21 ఏళ్లు. మహిళలు పురుషుల కంటే మూడేళ్ల ముందుగానే పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉంది. కానీ అమ్మాయిలు కూడ పెళ్లికి కనీస వయస్సు  21గా ఉండాలని సీఎం వాదించారు.

15 ఏళ్ల వయస్సులోనే మహిళలు పునరుత్పత్తి చేయగలరని వర్మ వాదించారు. ఈ విషయాన్ని డాక్టర్లు కూడ ధృవీకరిస్తున్నారని చెప్పారు. అమ్మాయిలకు 18 ఏళ్లు వివాహనికి తగినంత పరిణితిగా చెందిన వయస్సుగా భావిస్తారని మాజీ మంత్రి వర్మ చెప్పారు.

బాలికలు 18 ఏళ్లు దాటిన తర్వాత అత్తింటికి వెళ్లిన సమయంలో సంతోషంగా ఉండాలని మాజీ మంత్రి చెప్పారు.ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలను వర్మ తప్పుబట్టారు.
సీఎం గొప్ప శాస్త్రవేత్త లేదా గొప్ప వైద్యుడా అని ఆయన ప్రశ్నించారు. 

మాజీ మంత్రి వర్మ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. దేశంలోని అమ్మాయిలను అవమానించేలా వర్మ వ్యాఖ్యలున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి రాహుల్ కొఠారి చెప్పారు.

ఎఐసీసీ చీఫ్ సోనియాగాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లు కూడ మహిళలు అనే విషయాన్ని వర్మ మర్చిపోయిఈ వ్యాఖ్యలు చేశారేమోనని రాహుల్ అన్నారు. మహిళలకు వర్మ బహిరంగ క్షమాపణలు చెప్పాలని  ఆయన సజ్జన్ సింగ్ వర్మను కోరారు. సజ్జన్ ను పార్టీ నుండి బహిష్కరించాలని రాహుల్ సోనియాను కోరారు.