ఢిల్లీలోని ప్రభుత్వ షెల్టర్ హోమ్స్ లో దారుణం చోటుచేసుకుంది. షెల్టర్ హోమ్స్ లో ఉండే అమ్మాయిల పట్ల సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు. ఆ అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ లో కారపు పొడి చల్లి.. అతిక్రూరంగా హింసించారు. కాగా.. ఈ షెల్టర్ హోమ్స్ లో జరుతున్న దారుణాలపై సమాచారం అందుకున్న ఢిల్లీ మహిళా సంఘం సభ్యులు ఆ షెల్టర్ హోమ్స్ లో తనిఖీలు నిర్వహించారు.

మహిళ సంఘం సభ్యులు.. ఆ షెల్టర్ హోమ్స్ లో వసతి పొందుతున్న బాలికలతో మాట్లాడారు. వారంతా 6 నుంచి 15 సంవత్సరాలలోపు వారు మాత్రమే కావడం గమనార్హం. ఆ బాలికలకు సరైన భోజనం కూడా పెట్టకుండా సిబ్బంది హింసించేవారని బాలికలు తెలిపారు. వారి మాట వినకపోయినా.. ఎదురు చెప్పినా.. ప్రైవేట్ పార్ట్స్ లో కారం పొడి చల్లేవారని చెప్పారు.

బలవంతంగా గొడ్డుకారం తినిపించేవారని బాలికలు కన్నీరు పెట్టుకున్నారు. అంతేకాకుండా  టాయ్ లెట్లు కడిగించడం, దుస్తులు ఉతకడం, రూమ్స్ క్లీన్ చేయించడం అలాంటి  పనులు కూడా బాలికలతోనే చేయించేవారట. హోమ్ లో మొత్తం 22మంది బాలికలు ఉండగా.. వారికి ఆహారం వండే కుక్ మాత్రం ఒక్కరే ఉన్నారని.. అతను కూడా శుభ్రమైన ఆహారం పెట్టేవారు కాదని బాలికలు వివరించారు. 

రూమ్స్ శుభ్రంగా లేవనే కారణం చూపుతూ.. స్కేల్స్ తో కొట్టేవారని.. సెలవలు వచ్చినా.. కనీసం ఇంటికి కూడా వెళ్లనిచ్చేవారు కాదని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వివరాలు తెలుసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ వెంటనే ఈ ఘటనపై విచారణ చేపట్టారు. పోలీసుల చేత బాలికలతో స్టేట్ మెంట్ రికార్డ్ చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.