కరోనా వైరస్ కారణంగా జనాలు పిచ్చ బోర్ ఫీలవుతున్నారు. దీంతో స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. గంటల తరబడి ఛాటింగ్, యూట్యూబ్, ఓటీటీ ఫ్లాట్ ఫామ్, సినిమాలు.. ఇలా ఫోన్‌తో కాలం గడిపేస్తున్నారు. ముఖ్యంగా బయట ఆడుకునే అవకాశం లభించకపోవడంతో పిల్లలంతా ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలు అవుతున్నారు.

పెద్దలు ఎంతగా వారిస్తున్నా వినిపించుకోవడం లేదు. తాజాగా టీవీ, ఫోన్‌ను వాడొద్దని ఓ డాక్టర్ ఇచ్చిన సలహాతో మనస్తాపానికి గురైన బాలిక బలవన్మరణానికి పాల్పడింది.

వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని కతర్గం ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక జాహ్నవి. ఈమె గత కొన్ని వారాలుగా తలనొప్పి, ఛాతీ నొప్పితో బాధపడుతోంది. ఇటీవల ఆమె తల్లిదండ్రులు జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

జాహ్నవికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. టీవీ, స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగా చూడటం వల్లే తలనొప్పి వస్తోందని, కొద్దిరోజులు వాటికి దూరంగా ఉండాలని సలహా ఇచ్చింది. దీంతో బాలిక తల్లిదండ్రులు, ఆమెను టీవీ, ఫోన్‌కు దూరంగా పెట్టారు.

తన పేరెంట్స్ ఇలా వుండటానికి కారణం వైద్యుల సలహానే అని భావించిన బాలిక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం బట్టలు మార్చుకుంటానని నానమ్మకి చెప్పి గదిలోకి వెళ్లిన జాహ్నవి.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయింది.

సాయంత్రం మార్కెట్ నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తలుపులు తెరిచి చూడగా.. ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో జాహ్నవిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే బాలిక చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. డాక్టర్ సలహా నచ్చకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.