తండ్రి ప్రతిరోజూ తాగొచ్చి తల్లిని కొడుతుంటే ఆ బాలిక తట్టుకోలేకపోయింది. ఇక సహనం నశించి తల్లిని కాపాడుకోవడం కోసం ఏకంగా కన్నతండ్రినే హత్య చేసింది.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి (45) మద్యం సేవించి భార్యను తరచూ హింసిస్తుండేవాడు. ఏ పని చేయని ఈ వ్యక్తి కొడుకు తెచ్చే సంపాదనతో జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో కుమారుడికి పెళ్లి చేయాలనే విషయం గురించి తల్లి బుధవారం సాయంత్రం పిల్లలతో చర్చిస్తుండగా ఇంటికి వచ్చిన తండ్రి వాళ్లతో గొడవకు దిగాడు. ఇది తీవ్రరూపం దాల్చి భార్యను తీవ్రంగా దూషించడంతో పాటు దారుణంగా కొట్టాడు.

ఆ సమయంలో అక్కడే ఉన్న 16 ఏళ్ల కూతురు తల్లి బాధపడుతుండటం చూసి తట్టుకోలేకపోయింది. స్థానికంగా బట్టలు ఉతకడానికి ఉపయోగించే కర్రతో తండ్రి తలపై మోదింది.

అప్పటికే తండ్రిపైన పీకల్లోతు కోపంతో ఉన్న ఆ బాలిక రక్తం వస్తున్నా ఆగకుండా అతను చనిపోయేవరకు కర్రతో కొట్టింది. అనంతరం 100 నెంబరుకు ఫోన్‌ చేసి తండ్రిని తానే హత్య చేసినట్లు పోలీసులకు చెప్పింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను అదుపులోకి తీసుకుని ఆమెను జువైనల్ హోమ్‌కు తరలించారు.