లక్నో: పెళ్లి వేడుకలో  జరిపిన కాల్పుల్లో  పదేళ్ల బాలిక మరణించింది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఫరీదాపూర్‌లో ఈ ఘటన  చోటు చేసుకొంది. ఫరిదాపూర్‌లోని న్యూ కాలనీలో శుక్రవారం రాత్రి ఓ పెళ్లి జరిగింది. పెళ్లికి సంబంధించి వధూవరుల్లో ఓ వైపు వారు షాజహాన్‌పూర్‌ నుంచి వచ్చారు. ఆ సమయంలో జరిగిన వేడుకల్లో కొందరు వ్యక్తులు తాగిన మైకంలో కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్‌ మాన్సి అనే బాలికకు తగిలింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. బాలిక పెళ్లి కూతురుకు సోదరి అవుతుందని బంధువులు తెలిపారు.  బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై విచారణ నిర్వహిస్తున్నట్టుగా ఫరీదాబాద్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్  సురేంద్ర సింగ్ పచౌరీ చెప్పారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు. 

గతంలో కూడ యూపీ రాష్ట్రంలో వివాహా వేడుకల్లో కాల్పులు జరిపిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఈ తరహా ఘటనలపై కేసులు కూడ నమోదయ్యాయి.  అయినా కూడ   పదే పదే ఈ తరహా ఘటనలు పునరావృతం అవుతున్నాయి.  నిందితులను కఠినంగా శిక్షిస్తే  పదే పదే ఈ తరహా ఘటనలు  పునరావృతం కావని పలువురు అభిప్రాయపడుతున్నారు.