ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదని ఓ బాలుడు.. 16 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి హతమార్చాడు. అడ్డు వచ్చిన తల్లిపై కూడా దాడి చేశాడు. 

లక్నో: సోషల్ మీడియా వినియోగం నిత్యజీవితంలో భాగంగా మారింది. దాని ప్రభావం చూస్తుంటే అంతకు మించి అనే చెప్పాలి. నిత్యజీవితంలో భాగమైపోయి జీవితాలనే ప్రభావితం చేస్తున్నది. సోషల్ మీడియా ద్వారా మంచికి తోడు చెడు కూడా కొంచెం పాళ్లల్లో ఎక్కువే ఉన్నది. సోషల్ మీడియా కేంద్రంగా ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. తాజాగా, ఫేస్‌బుక్‌లో తన ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదని ఓ టీనేజీ బాలుడు.. టీనేజీ బాలికతో కత్తితో పొడిచి చంపేశాడు.

ముజఫర్‌నగర్‌కు చెందిన రవి అనే టీనేజీ బాలుడు ఓ బాలికకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. కానీ, ఆ 16 ఏళ్ల బాలిక రవి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. దీంతో రవి రగిలిపోయాడు. చివరకు సోషల్ మీడియా అంటే.. వర్చువల్‌లో ఒక సౌలభ్యం కోసం నిజ జీవితంలో ఘోర నిర్ణయం తీసుకున్నాడు. ఆ బాలికను అంతం చేయాలనే పథకం వేశాడు.

ఫరీదాబాద్ ఫ్యాక్టరీకి చెందిన సెక్యూరిటీగా పని చేస్తున్న తేజవీర్ సింగ్ కూతురే ఆ రవి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. తేజవీర్ సింగ్ కుమార్తెను చంపేయడానికి రవి ఎవరికీ అనుమానం రాకుండా పెళ్లి పత్రికలు పంచుతున్నట్టుగా వారి ఇంటికి వెళ్లాడు. వెడ్డింగ్ కార్డు తీసుకోవాల్సిందిగా రవి తేజవీర్ సింగ్ ఇంటికి వచ్చి చెప్పాడు. ఆ శుభ లేఖను తీసుకోవడానికి తేజవీర్ సింగ్ కుమార్తె రవి దగ్గరకు వెళ్లింది. తేజవీర్ సింగ్ కుమార్తె సమీపించగానే రవి అప్పటి వరకు దాచి ఉంచిన కత్తిని తీసి పొడిచేశాడు. దీంతో ఆ బాలిక విలవిల్లాడుతూ నేలకొరిగింది. ఈ ఘటనను చూసిన బాలిక తల్లి వేగంగా ఆమెను రక్షించడానికి పరుగు తీసింది. రవిని అడ్డుకోవడానికి వెళ్లింది. కానీ, ఆ నిందితుడు బాలిక తల్లిపై కూడా దాడి చేశాడు. ఆ తర్వాత రవి తనను తానే చంపేసుకోవడానికి ప్రయత్నించినట్టు ఎస్పీ వివరించారు.

తేజవీర్ సింగ్ ఈ ఘటనపై పోలీసులకు పిర్యాదు ఇచ్చాడు. రవి తన కుమార్తెకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడని పేర్కొన్నాడు. కానీ, తన కుమార్తె ఆ నిందితుడి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదని తెలిపాడు. దీన్ని అక్కసుగానే తన కుమార్తెను హత్య చేశాడని ఆరోపించాడు.

ప్రస్తుతం తేజవీర్ సింగ్ భార్య సునీత, నిందితుడు రవి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు సర్కిల్ ఆఫీసర్ ధర్మేంద్ర చౌహాన్ వెల్లడించారు.